మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు.. తుది తీర్పుపై ఆసక్తి పెంచిన తాజా పరిణామం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, మలయాళ స్టార్ మోహన్‌లాల్(Mohanlal)కు సంబంధించిన ఏనుగు దంతాల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆయన గతంలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ (వీడీఎస్) పత్రాలు తాజాగా కేరళ హైకోర్టు పరిశీలనకు వచ్చాయి. ఆ పత్రాల్లో తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలతో పాటు వాటితో తయారైన 13 ఐవరీ విగ్రహాలు ఉన్నట్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇప్పటికే చర్చనీయాంశంగా ఉన్న ఈ కేసు మరోసారి న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వ్యవహారం 2011లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల తర్వాత ప్రారంభమైంది. ఆ సమయంలో కొచ్చిలోని మోహన్‌లాల్ నివాసం నుంచి నాలుగు ఏనుగు దంతాలు స్వాధీనం కావడంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం కేరళ అటవీ శాఖ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ అంశం కోర్టు పరిధిలోనే కొనసాగుతోంది. తాజా విచారణలో మోహన్‌లాల్ తరఫు న్యాయవాదులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐవరీ అమ్నెస్టీ పథకం ప్రకారం అవసరమైన వివరాలను ముందుగానే వెల్లడించామని, ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ఈ కేసులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఏనుగు దంతాల యాజమాన్యానికి సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాలపైనే ఉంది. ఆదాయపు పన్ను శాఖకు ఆస్తుల వివరాలు వెల్లడించడం ఒక అంశమైతే, అటవీ శాఖ నుంచి చట్టబద్ధమైన ఓనర్షిప్ సర్టిఫికేట్ సకాలంలో పొందారా లేదా అన్నదే ప్రస్తుతం హైకోర్టు పరిశీలిస్తున్న కీలక ప్రశ్నగా మారింది. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ అంశంపై తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఆ తీర్పు ఈ కేసు భవిష్యత్ దిశను నిర్ణయించే అవకాశముంది.








