పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!
గతంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘సుగాలి ప్రీతి’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) లక్ష్యంగా చేసుకుని సుగాలి ప్రీతి తల్లి ‘సుగాలి పార్వతీదేవి’ గన్నవరం(Gannavaram) పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్‌పై చీటింగ్ (మోసం), నమ్మక ద్రోహం సహా పలు చట్టపరమైన నిబంధనల కింద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. అధికారంలో ఉన్న పెద్దలపైనే ఈ స్థాయి ఫిర్యాదు అందడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఫిర్యాదు అనంతరం సుగాలి పార్వతీదేవి మాట్లాడుతూ జనసేన అధినేతపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తాను డిప్యూటీ సీఎం అయ్యాక చేసే మొదటి సంతకం నా కూతురు ‘సుగాలి ప్రీతి’ కేసు ఫైలుపైనే అని పవన్ కళ్యాణ్ మాకు పెద్దపెద్ద మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పూర్తిగా మాట మార్చారు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తమను నమ్మించి మోసం చేశారని ఆమె మండిపడ్డారు.
తనకు జరిగిన అన్యాయంపై, ఇచ్చిన హామీలపై న్యాయం చేయాలని తాను కోరిన ప్రతిసారి.. జనసేన పార్టీకి చెందిన స్థానిక నేతలు, కార్యకర్తలు తనపై భౌతిక దాడులకు దిగుతున్నారని పార్వతీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ కల్పించాల్సిన వారే దాడులు చేయిస్తుండటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి, తన కూతురు సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై గన్నవరం పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.








