AI పొలం భాషను నేర్చుకుంది… రైతు కష్టానికి కొత్త అండగా మారుతోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఉదయం పది గంటలు.
ఒక రైతు బ్యాంక్‌లోకి అడుగుపెట్టాడు.
ఎప్పటిలాగే…
చేతిలో ఒక పాత ఫైల్. అందులో… పట్టాదారు పాస్‌బుక్. ఆధార్. భూమి పత్రాలు.
ఈసారి అయినా లోన్ మంజూరవుతుందనే చిన్న ఆశ.
మేనేజర్ ఫైల్ తీసుకోలేదు.
ముందు కంప్యూటర్ స్క్రీన్‌నే చూశాడు.
కొన్ని క్షణాలు…
మౌనం.
రైతు గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది.
“సార్… ఏమైనా సమస్యా?”
మేనేజర్ స్క్రీన్ నుంచి చూపు తిప్పకుండా అడిగాడు.
“ఈసారి కూడా వరే వేశారా?”
రైతు ఆశ్చర్యపోయాడు.
“అవును సార్… కానీ… మీకు ఎలా తెలుసు?”
మేనేజర్ మరో ప్రశ్న వేశాడు.
“ఉత్తర వైపు పొలంలో ఈసారి నీటి లభ్యత కొంచెం తగ్గింది కదా?”
రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు
ఆ విషయం…
పక్క పొలం రైతుకి కూడా ఇంకా తెలియదు.
“సార్…
మీరు మా ఊరికి వచ్చారా?”
మేనేజర్ నవ్వాడు.
“నేను కాదు…
మీ పొలాన్ని… ఇప్పటికే మా శాటిలైట్ చూసింది”
ఈ సన్నివేశం ఇప్పటికి ఊహ మాత్రమే. కానీ… భారత వ్యవసాయంలో ఇది ఇక ఊహగానే మిగిలిపోకపోవచ్చు.
ఎందుకంటే…
రైతు జీవితంలోకి ఒక కొత్త భాగస్వామి వచ్చేశాడు. అతనే AI .
కాగితం… కష్టం… కాలయాపన!
ఇంతకాలం వ్యవసాయ రుణం అంటే… కాగితాలు పట్టుకుని బ్యాంక్ చుట్టూ తిరగటం. పత్రాల పరిశీలన. పొలం దగ్గరకు వెళ్లి స్వయంగా చూసే ఫీల్డ్ విజిట్. మళ్లీ బ్యాంక్‌కు రిపోర్ట్. మళ్లీ పరిశీలన. అలా… ఒక వ్యవసాయ రుణం మంజూరు కావడానికి 15 రోజుల నుంచి 30 రోజుల వరకు పట్టేది.
అప్పటికి…
విత్తే కాలం దాటిపోయేది. మంచి విత్తనం చేతిలో ఉండేది కాదు.
ఎరువు ధర పెరిగిపోయేది.
కొన్నిసార్లు…
రైతు ఓడిపోవడానికి కారణం ప్రకృతి కాదు.
సమయానికి రాని డబ్బే.
ఒక సామెత ఉంది.
“కాలం కలిసిరాకపోతే కలప కూడా కరగదు.”
రైతు జీవితంలో ఆ “కాలం”నే ఇప్పుడు AI అందుకోవాలని ప్రయత్నిస్తోంది.
కన్ను శాటిలైట్ది… వివరణ AIది!
భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే శాటిలైట్లు… రైతు పొలాన్ని ఇప్పుడు నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి.
అక్కడ ఏ పంట ఉంది… ఎంత ఎకరం సాగు జరిగింది… ఎప్పుడు విత్తారు… పంట ఆరోగ్యం ఎలా ఉంది… నీటి లభ్యత ఎంత… గత సీజన్లలో దిగుబడి ఎలా వచ్చింది… వర్షపాతం ఎలా నమోదైంది… ఇలాంటి వందలాది సంకేతాలను నమోదు చేస్తున్నాయి.
కానీ…
శాటిలైట్‌కు కనిపించేది చిత్రం మాత్రమే. ఆ చిత్రాన్ని చదివేది… AI.
అదే అసలు మ్యాజిక్.
మనిషి కంటికి ఒక ఫొటోలా కనిపించేది… AIకి మాత్రం ఒక పూర్తి వ్యవసాయ చరిత్రలా కనిపిస్తోంది. పొలమే రైతు తరఫున… మాట్లాడుతున్నట్లుగా AI శాటిలైట్ చిత్రాలను విశ్లేషిస్తుంది. పంటను గుర్తిస్తుంది. సాగు చరిత్రను పరిశీలిస్తుంది. పంట ఆరోగ్యం, వర్షపాతం, ఉష్ణోగ్రత, భూగర్భ జలాలు వంటి సమాచారాన్ని ఒకే రిపోర్ట్ గా మారుస్తుంది.
ఆ రిపోర్ట్… ఇప్పుడు బ్యాంకుల ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు… రైతు తన పొలం గురించి తానే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు… పొలమే రైతు తరఫున మాట్లాడుతోంది. రైతు మాట విలువ తగ్గలేదు. కానీ… ఇప్పుడు అతని మాటకు… డేటా కూడా తోడైంది.
నెలల నిరీక్షణ… నిమిషాల నిర్ణయం!
ఈ డిజిటల్ విశ్లేషణ వల్ల… వసాయ రుణాల పరిశీలన వేగంగా మారుతోంది. తంలో 15 నుంచి 30 రోజులు పట్టే ప్రక్రియ… ప్పుడు కొన్ని సందర్భాల్లో గంటలోపే పూర్తవుతోంది. కొన్ని రుణాలు… అదే రోజు మంజూరయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.
AI రైతుకు డబ్బు ఇవ్వడం లేదు. కానీ… డబ్బు రైతు చేతికి చేరే సమయాన్ని మార్చేస్తోంది. వ్యవసాయంలో… ఇది చిన్న మార్పు కాదు.
ఒక్క పొలం కాదు… లక్షల కథలు!
ఇది ఇంకా ప్రయోగ దశలో ఉన్న ఆలోచన మాత్రమే కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా… 15 లక్షలకు పైగా రైతు పొలాలను ఈ విధానంలో విశ్లేషించారు. 1.95 లక్షల గ్రామాల వ్యవసాయ సమాచారాన్ని అధ్యయనం చేశారు. ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థల్లో బెంగళూరుకు చెందిన SatSure ఒకటి. మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఈ సంస్థ… శాటిలైట్ డేటా, AI సహాయంతో వ్యవసాయ భూముల డిజిటల్ విశ్లేషణను అభివృద్ధి చేసింది.
బ్యాంకులు… ఆర్థిక సంస్థలు… ప్రభుత్వ విభాగాలు… ఈ సమాచారాన్ని రుణ నిర్ణయాల్లో అదనపు ఆధారంగా ఉపయోగిస్తున్నాయి.
లోన్‌తో మొదలు… భవిష్యత్తు అంతా!
ఈ కథ… కేవలం లోన్‌తో ముగియదు. రేపు… పంట బీమా. పంట నష్టం అంచనా. పరిహారం. వాతావరణ ప్రమాదాల ముందస్తు హెచ్చరిక.
వీటన్నింటికీ… ఇదే శాటిలైట్ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే… AI రైతుకు కేవలం రుణం అందించడంలోనే కాదు… వ్యవసాయాన్ని మరింత తెలివైన వ్యవస్థగా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
సందేహాలు
అయితే… ప్రతి కొత్త టెక్నాలజీలా… దీనిపైనా కొన్ని సందేహాలు ఉన్నాయి. మేఘాలు కమ్ముకుంటే? చిన్న చిన్న పొలాలను ఎంత ఖచ్చితంగా గుర్తించగలదు?
డేటా తప్పుగా వస్తే? రైతుకు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుందా? హ్యూమన్ వెరిఫికేషన్ పూర్తిగా అవసరం లేకుండా పోతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే… AIని తుది తీర్పుగా కాదు. మంచి నిర్ణయం తీసుకునేందుకు ఒక కొత్త ఆధారంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
ఫైనల్ గా..
పొలం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది.
వినలేకపోయింది… ఈ ప్రపంచమే.
ఇప్పుడు… AI ఆ భాష నేర్చుకుంది.








