జూలైలో కిచెన్ గార్డెన్ మొదలుపెడుతున్నారా? ఈ కూరగాయలు తప్పకుండా పెంచండి..
జూలై నెల వచ్చేసరికి ఇంట్లో లేదా టెర్రస్ గార్డెన్ లో కూరగాయల సాగుకు ఆలస్యమైందని చాలామంది భావిస్తారు. కానీ ఈ నెలలో కూడా కొన్ని రకాల కూరగాయలను నాటితే మంచి దిగుబడిని పొందవచ్చు. ముఖ్యంగా వేడి, వాన కలిసిన వాతావరణాన్ని తట్టుకునే, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే పంటలను ఎంచుకుంటే ఇంటి తోటలోనే తాజా కూరగాయలను పండించుకోవచ్చు. సరైన విత్తనాలు, నేల సంరక్షణ, నీటి నిర్వహణతో జూలైలో ప్రారంభించిన తోట కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.
బుష్ బీన్స్,దోసకాయ సాగు ప్రత్యేకతలు

ఈ కాలంలో బుష్ బీన్స్ (Bush Beans) సాగు చేయడం మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇవి వేగంగా మొలకెత్తి తక్కువ రోజుల్లోనే కాయలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. మొక్కల నుంచి కాయలను తరచుగా కోస్తూ ఉంటే దిగుబడి మరింత కాలం కొనసాగుతుంది. నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
దోసకాయ (Cucumber) కూడా జూలైలో సాగు చేయడానికి అనువైన కూరగాయల్లో ఒకటి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల సూర్యరశ్మి అందే ప్రదేశంలో నాటితే మొక్కలు బలంగా పెరుగుతాయి. తీగలను ట్రెల్లిస్ (Trellis) లేదా కర్రల సహాయంతో పెంచితే కాయల నాణ్యత మెరుగుపడటంతో పాటు మొక్కలకు గాలి ప్రసరణ కూడా బాగా ఉంటుంది.
స్క్వాష్, బెండకాయ పంటల పెంపకం

సొరకాయ, జుక్కిని (Zucchini), యెల్లో స్క్వాష్ (Yellow Squash) వంటి స్క్వాష్ (Summer Squash) రకాలు కూడా ఈ కాలానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తక్కువ సమయంలో పెరిగి త్వరగా దిగుబడి ఇస్తాయి. మొక్కల మధ్య తగినంత దూరం ఉంచడం వల్ల ఫంగస్, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బెండకాయ (Okra) ఎటువంటి వాతావరణంలో అయినా తట్టుకొని అద్భుతంగా పెరిగే పంట. జూలైలో నాటిన బెండ మొక్కలు సరైన సంరక్షణతో అధిక దిగుబడిని అందిస్తాయి. లేత కాయలను సమయానికి కోయడం వల్ల కొత్త కాయలు నిరంతరం వస్తుంటాయి. క్రమం తప్పకుండా కలుపు మొక్కలను తొలగించడం అవసరం.
ఆకుకూరల సాగు

ఆకుకూరలను ఇష్టపడేవారికి తోటకూర,పాలకూర, పొన్నగంట మంచి ఎంపిక. బయట ఆకులను మాత్రమే కోస్తే మధ్య భాగం నుంచి కొత్త ఆకులు మళ్లీ పెరుగుతాయి. దీంతో ఒకే మొక్క నుంచి ఎక్కువకాలం దిగుబడి పొందవచ్చు.
బ్లాక్ ఐడ్ పీస్ సాగు ప్రయోజనాలు

బ్లాక్ ఐడ్ పీస్ (Black-Eyed Peas) కూడా జూలైలో సాగు చేయదగిన మరో పంట. ఇది తక్కువ నీటితో పెరగడమే కాకుండా నేల సారాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చల్లటి వాతావరణం ఉండే ప్రాంతాల్లో బీట్రూట్ (Beetroot)ను కూడా ఈ నెలలో నాటవచ్చు. దీని దుంపలతో పాటు ఆకులు కూడా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
జూలైలో తోట నిర్వహణకు ముఖ్య జాగ్రత్తలు
జూలైలో ఏ కూరగాయను సాగు చేసినా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో మొక్కల చుట్టూ మల్చింగ్ (Mulching) చేయడం, కలుపు మొక్కలను తొలగించడం, సేంద్రియ ఎరువులను వినియోగించడం, మొక్కలకు తగినంత సూర్యరశ్మి అందేలా చూడడం వల్ల దిగుబడి మెరుగుపడుతుంది. సరైన పంటలను సరైన సమయంలో ఎంపిక చేసుకుని శ్రద్ధగా సంరక్షిస్తే, జూలైలో ప్రారంభించిన ఇంటి కూరగాయల తోట కూడా సమృద్ధిగా పంటను అందిస్తుంది.








