సింగపూర్ సహకారంతో విద్యాశాఖలో సామర్థ్యాల పెంపునకు మరిన్ని కార్యక్రమాలు
అమరావతి : సింగపూర్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ఈ సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు.
ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణతో పాటు ప్రభుత్వ అధికారులకు నాయకత్వ నైపుణ్యాలు, డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.
రాజధాని అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం సింగపూర్–ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ (JISC) మూడో సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం సింగపూర్ ప్రతినిధులతో సమావేశమైంది. అమరావతిని ఆధునిక, సమగ్ర, సుస్థిర రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత రెండు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు.
సింగపూర్ శిక్షణ ఫలాలు ప్రతి ఉపాధ్యాయుడికీ అందాలి
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులకు సింగపూర్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఇందుకు సింగపూర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని వేసవి సెలవుల్లో సింగపూర్‌కు పంపించి అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు తమ అనుభవాన్ని, నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు. ఇందుకోసం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని, సింగపూర్ శిక్షణ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విద్యాశాఖలో సామర్థ్యాల పెంపు కార్యక్రమాలను మార్గదర్శకత్వం, దిశానిర్దేశం , పరిపాలన అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలు కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా విద్యావ్యవస్థ మొత్తానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని సూచించారు.
మంత్రులు, కార్యదర్శులకు కలిపి శిక్షణతో మెరుగైన సమన్వయం
సింగపూర్ సహకారంతో అమలు చేస్తున్న SAGE కార్యక్రమం కింద మంత్రులు, శాఖల కార్యదర్శులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం కంటే సంబంధిత మంత్రి, అదే శాఖ కార్యదర్శికి ఒకేసారి శిక్షణ ఇవ్వడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల విధాన నిర్ణయాలు, వాటి అమలులో సమన్వయం పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సివిల్ సర్వెంట్లకు నాయకత్వ లక్షణాలు, ఆధునిక పరిపాలనా విధానాలు, డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ, పరస్పర అనుభవాల మార్పిడి కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు.


డిజిటల్ గవర్నెన్స్‌లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకుంటాం
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, సమీకృత డిజిటల్ వేదికల రూపకల్పన, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, డేటా ఆధారిత నిర్ణయాల విషయంలో సింగపూర్ సహకారాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఈ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుస తుఫానుల కారణంగా కొన్ని కార్యక్రమాల అమలులో జాప్యం జరిగిందని వివరించారు. ఆ అవరోధాలను అధిగమించి ప్రతిపాదిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో రెండు ప్రభుత్వాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఆరు నెలలకోసారి పురోగతిపై సమీక్ష
గత జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల అమలులో జాప్యం జరిగిన అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ఇకపై కమిటీ ప్రతిపాదించిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో నిర్దేశిత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై సింగపూర్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిపాలన, నాయకత్వ శిక్షణ వంటి రంగాల్లో సహకారానికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆర్థిక, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి, ఏపీసీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ గణేష్ కుమార్, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ప్రణాళికా శాఖ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్, అదనపు కమిషనర్లు ఎ. భార్గవ్ తేజ, అభిషేక్ కుమార్, కె. కార్తీక్, ఏడీసీఎల్ చైర్పర్సన్ లక్ష్మీపార్థసారథి, ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఆర్. అలపర్తి, ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్ దత్తి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సింగపూర్ ప్రతినిధి బృందానికి గన్ సియో హువాంగ్ నేతృత్వం వహించారు. ఈ బృందంలో సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు చెందిన ప్రతినిధులతో పాటు డాక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ (సీనియర్ డైరెక్టర్, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా విభాగం), ఫెయిన్ యీ (డైరెక్టర్–ఇండియా), ఎలిజా అంగ్ (సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్–ఇండియా), జోసెఫ్ మంటో (అసిస్టెంట్ డైరెక్టర్–ఇండియా), సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టాయ్ లియన్ చియు, లిమ్ చీ కియా (డిప్యూటీ డైరెక్టర్), ఎంటర్ప్రైజ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హో చీ హిన్, రీజినల్ డైరెక్టర్ జెసీ ఎన్జీ, చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ విలియం చిక్, న్యూఢిల్లీలోని సింగపూర్ డిప్యూటీ హై కమిషనర్ సుమయా బకావి, ఎంటర్ప్రైజ్ సింగపూర్ ప్రతినిధి రీమస్ లియు, కాన్సుల్ శామ్యూల్ లోహ్, ఫస్ట్ సెక్రటరీ జోషువా హెచ్‌సీ లిమ్ తదితరులు పాల్గొన్నారు.







