స్టీల్ పాత్రలు కొత్తవాటిలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!
స్టీల్ పాత్రలపై మరకలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా తొలగించాలి?
ప్రతి ఇంట్లో వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పాత్రల్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు (Stainless Steel Utensils) ముఖ్యమైనవి. రోజూ వంట చేయడం, ఆహారం నిల్వ చేయడం, భోజనం చేయడం వంటి అవసరాలకు వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే కొంతకాలం తర్వాత స్టీల్ పాత్రలపై మొండి మరకలు, నీటి మచ్చలు, నూనె జిడ్డు పేరుకుపోతాయి. కొన్నిసార్లు ఎంత శుభ్రం చేసినా పాత మెరుపు కనిపించదు. కొత్తగా కొనుగోలు చేసినప్పుడు ఉన్నట్లు పాత్రలు మెరవాలంటే ఖరీదైన క్లీనర్ల అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
స్టీల్ పాత్రలపై నూనె (Oil) జిడ్డు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. ఒక గిన్నెలో వేడిగోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ (Dishwashing Liquid) కలపాలి. ఈ నీటిలో పాత్రలను కొన్ని నిమిషాలు నానబెట్టి మెత్తని స్పాంజితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె మరకలు సులభంగా తొలగిపోతాయి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి పొడి వస్త్రంతో తుడవాలి.
వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మకాయతో స్టీల్ పాత్రలకు కొత్త మెరుపు
పాత్రలపై నీటి మరకలు, తెల్లటి మచ్చలు కనిపిస్తుంటే వెనిగర్ (Vinegar) ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో కొద్దిగా వైట్ వెనిగర్ కలిపి పాత్రలపై ఉన్న మరకల దగ్గర రాయాలి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తని గుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. వెనిగర్‌లోని ఆమ్ల గుణాలు నీటి మరకలను తొలగించడంలో సహాయపడతాయి. అయితే శుభ్రం చేసిన తర్వాత నీటితో బాగా కడగాలి.
స్టీల్ పాత్రల అడుగు భాగంలో నల్లటి మచ్చలు లేదా కాలిన ఆహార పదార్థాలు అంటుకుపోతే బేకింగ్ సోడా (Baking Soda) ఉపయోగపడుతుంది. పాత్రలో కొద్దిగా నీరు పోసి అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు మరిగించి చల్లారిన తర్వాత మెత్తని స్క్రబ్బర్‌తో శుభ్రం చేయాలి. మొండి మరకలు ఉంటే బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా చేసి మరకలపై రాసి కొద్దిసేపటి తర్వాత తుడవచ్చు.
నిమ్మకాయ (Lemon) కూడా స్టీల్ పాత్రల శుభ్రతకు ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని కొద్దిగా నీటిలో కలిపి పాత్రలపై రాసి మెత్తని గుడ్డతో తుడవాలి. ముఖ్యంగా నీటి మరకలు, స్వల్పమైన జిడ్డు తొలగించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. శుభ్రం చేసిన తర్వాత పాత్రలను నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
ఇవి కూడా చదవండి
స్టీల్ పాత్రలు ఎక్కువకాలం మెరవాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు
స్టీల్ పాత్రలు ఎక్కువకాలం మెరుస్తూ ఉండాలంటే, పాత్రలను కడిగిన వెంటనే తుడిచి ఆరబెట్టాలి. తడి పాత్రలను ఒకదానిపై మరొకటి పేర్చకుండా చూసుకోవాలి. ఇనుప వైర్ స్క్రబ్బర్లు, గరుకైన పౌడర్లు ఉపయోగించడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అందుకే మెత్తని స్పాంజిలు ఉపయోగించడం మంచిది. అలాగే బ్లీచ్, క్లోరిన్ ఉన్న క్లీనర్లను స్టీల్ పాత్రలపై ఉపయోగించకూడదు. వెనిగర్, నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలను కూడా ఎక్కువసేపు పాత్రలపై ఉంచకూడదు.







