10 ఏళ్లు… ఒక్క హిట్! అఖిల్ కెరీర్లో అసలు తప్పు ఎక్కడ జరిగింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“ప్రతి హీరో రెండు సార్లు పుడతాడు.
ఒకసారి కెమెరా ముందు.
ఇంకోసారి ప్రేక్షకుల ఊహల్లో.
మొదటి పుట్టుకను నిర్మాతలు ప్లాన్ చేయగలరు.
రెండో పుట్టుకను మాత్రం ప్రేక్షకులే నిర్ణయిస్తారు.”
అఖిల్‌కు మొదటి పుట్టుక అద్భుతంగా జరిగింది.
రెండోది…
ఇంకా జరుగుతూనే ఉంది.
“స్టార్ హీరో కొడుకు.”
ఈ ఒక్క ట్యాగ్‌తోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు అఖిల్ అక్కినేని. భారీ లాంచ్. భారీ అంచనాలు. భారీ బడ్జెట్లు.
కానీ… పదేళ్లు గడిచిపోయాయి. కానీ కేవలం ఆరు సినిమాలు మాత్రమే పూర్తయ్యాయి. అయినా ప్రేక్షకులు ఇప్పటికీ ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు.
“అసలు అఖిల్‌కు ఎక్కడ తప్పు జరుగుతోంది?”
నటనా?
కథల ఎంపికా?
లేక ప్రతి సినిమాతో తన ఇమేజ్ మార్చుకోవడమే అతిపెద్ద తప్పా? ఇప్పుడు అందరి చూపు ‘లెనిన్’ మీద ఉండటంతో… అఖిల్ కెరీర్‌ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం వచ్చింది.
గ్రాండ్ ఎంట్రీ… కానీ మొదటి అడుగే తడబడింది
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత హైప్‌తో వచ్చిన డెబ్యూలలో ‘అఖిల్’ ఒకటి. నాగార్జున వారసుడిగా… వి.వి. వినాయక్ దర్శకత్వంలో భారీ స్థాయిలో లాంచ్ చేశారు. ట్రైలర్లు, ప్రమోషన్లు, బిజినెస్… అన్నీ రికార్డు స్థాయిలోనే జరిగాయి. కానీ విడుదల తర్వాత ప్రేక్షకుల తీర్పు పూర్తిగా భిన్నంగా వచ్చింది. ఆ ఫ్లాప్ కేవలం ఒక సినిమా పరాజయం కాదు… అది ఒక ప్రారంభం. ప్రేక్షకుల ఊహల్లో పుట్టాల్సిన రెండో అఖిల్… అక్కడే ఆగిపోయిన క్షణం.
మళ్లీ లవ్ స్టోరీ… కానీ అదృష్టం కలిసి రాలేదు
ఆ తర్వాత వచ్చిన ‘హలో’ లో అఖిల్ పూర్తిగా కొత్తగా కనిపించాడు. యాక్షన్ నుంచి ఎమోషనల్ లవర్ బాయ్‌గా మారాడు. సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినా… బాక్సాఫీస్ మాత్రం స్పందించలేదు.
తర్వాత వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ కూడా అదే పరిస్థితి.
సాంగ్స్ హిట్… ప్రచారం బాగానే జరిగింది… కానీ థియేటర్లలో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. ప్రతి ప్రయత్నం ఒక కొత్త రూపం. కానీ… ప్రేక్షకుల ఊహల్లో మాత్రం ఇంకా ఖాళీ పేజీ.
చివరకు వచ్చిన మొదటి హిట్
చాలా కాలం తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అఖిల్‌కు ఊపిరి పోసింది. పూజా హెగ్డే జోడీ… ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ… మంచి పాటలు… అన్నీ కలిసి పనిచేశాయి. ఇదే అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ భావించారు. బహుశా… ఇదే రెండో పుట్టుక మొదలవుతుందేమో అనిపించింది.
అదే సమయంలో జరిగిన అతిపెద్ద తప్పు?
అక్కడి నుంచే అఖిల్ కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. లవర్ బాయ్ ఇమేజ్ను బలపరచకుండా… ఒక్కసారిగా భారీ స్పై యాక్షన్ సినిమాలోకి వెళ్లిపోయాడు. ‘ఏజెంట్’. భారీ బడ్జెట్. అంతర్జాతీయ స్థాయి యాక్షన్. భారీ మేకోవర్. కానీ కథ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఫలితం…
టాలీవుడ్లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఒకసారి మళ్లీ… ప్రేక్షకుల ఊహల్లో పుట్టాల్సిన అఖిల్… మళ్లీ వాయిదా పడిపోయాడు.
అసలు సమస్య ఫ్లాపులు కాదు…
అఖిల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ప్రతి సినిమా… ఒక కొత్త అఖిల్ ని పరిచయం చేస్తూ వ స్తోంది.
‘అఖిల్’లో మాస్ హీరో.
‘హలో’లో క్లాస్ లవర్.
‘మిస్టర్ మజ్ను’లో రొమాంటిక్ హీరో.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఫ్యామిలీ హీరో.
‘ఏజెంట్’లో స్పై యాక్షన్ స్టార్.
ఇప్పుడు ‘లెనిన్’లో గ్రామీణ యాక్షన్ డ్రామా.
ఈ ప్రయాణంలో ఒక విషయం మాత్రం జరగలేదు. ప్రేక్షకుల మనసుల్లో “ఇదే అఖిల్” అనే స్పష్టమైన రూపం పుట్టలేదు.
మొదటి పుట్టుక జరిగింది.
రెండోది…
ఇంకా పూర్తికాలేదు.
అభిమానులు కూడా అదే చెబుతున్నారు
సోషల్ మీడియాలో తరచూ కనిపించే కామెంట్లు కూడా దాదాపు ఇదే చెబుతున్నాయి.
“అఖిల్‌కు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది.” “డాన్స్ బాగుంటుంది.” “ఫైట్స్ చేయగలడు.” “లుక్స్ కూడా ఉన్నాయి.” “కానీ గుర్తుండిపోయే కథ ఒక్కటి పడలేదు.”
మరికొందరు… “స్క్రిప్ట్ సెలక్షన్‌లోనే ఎక్కువ తప్పులు జరిగాయి” అంటుంటే… మరికొందరు… “తనకు బాగా సూట్ అయ్యే జానర్‌ను ఇంకా ఫిక్స్ చేసుకోలేదు” అని అభిప్రాయపడుతున్నారు. అంటే… ప్రేక్షకులు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆ రెండో పుట్టుక కోసం.
ఇప్పుడు మొత్తం ఆశ ‘లెనిన్’పైనే…
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ తర్వాత వస్తున్న ‘లెనిన్’ సాధారణ సినిమా కాదు. ఇది అతని కెరీర్‌కు మరో ప్రారంభం కావచ్చు. లేదంటే… మరోసారి అదే ప్రశ్నను మళ్లీ మొదలుపెట్టే సినిమా కూడా కావచ్చు. ఈసారి… ప్రేక్షకుల ఊహల్లో అఖిల్ నిజంగా పుడతాడా?
ఏదైమైనా…
కెరీర్లు… ఫ్లాపులతో ముగియవు.
హిట్లతో కూడా మొదలుకావు.
ఒక రోజు…
ప్రేక్షకుడు ఆ హీరోను చూసి…
“ఇదే అతను.” అని నమ్మినప్పుడు మాత్రమే ఒక స్టార్ నిజంగా పుడతాడు.
అఖిల్‌కు…
మొదటి పుట్టుకను ఇండస్ట్రీ ఇచ్చింది.
రెండో పుట్టుకను మాత్రం ప్రేక్షకులే ఇవ్వాలి.
పదేళ్లుగా… అతను పాత్రలు మారుస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు మారాల్సింది పాత్ర కాదు. ప్రేక్షకుడి మనసులో అతని స్థానం.
ఎందుకంటే…
ప్రతి హీరో రెండు సార్లు పుడతాడు.
అఖిల్‌కు మొదటి పుట్టుక ఎప్పుడో పూర్తయింది.
రెండో పుట్టుక…
ఇంకా ఒక సినిమా దూరంలోనే ఉండొచ్చు.








