ఏపీ ప్రభుత్వ డేటా భద్రతకు పెద్దపీట.. సచివాలయంలో కీలక సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్
APTS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఆధ్వర్యంలో సచివాలయంలో ఒక ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డిజిటలైజేషన్ – డేటా భద్రత ఆవశ్యకత..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న వేగవంతమైన డిజిటలైజేషన్ నేపథ్యంలో, పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య రికార్డులు, భూమి పత్రాలు , సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక డేటాను రక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారిందని మోహన కృష్ణ పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న దేశవ్యాప్త సైబర్ సెక్యూరిటీ సదస్సుకు సన్నాహకంగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల భద్రతా ప్రమాణాలను ఈ వర్క్‌షాప్‌లో సమీక్షించారు.

వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలు..
ప్రభుత్వ శాఖల్లో సైబర్ భద్రత అమలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు , భవిష్యత్తులో అవసరమైన ఆధునిక భద్రతా వ్యవస్థలపై అధికారులు విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఈ క్రమంలో, స్టేట్ డేటా సెంటర్లు , SWAN నెట్‌వర్క్‌ల భద్రతను పటిష్టం చేయడంతో పాటు రిస్క్ అసెస్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, సైబర్ దాడులు జరిగినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేగవంతమైన స్పందన వ్యవస్థలను (Rapid Response Systems) ఏర్పాటు చేయాల్సిన అవసరంపై చర్చించారు. దీనితో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (CISO) నియామకం, పాత అప్లికేషన్ల ఆధునికీకరణ , అధికారులకు నిరంతర సైబర్ భద్రతా శిక్షణను అందించడం వంటి పరిపాలనాపరమైన అంశాలకు కూడా ఈ వర్క్‌షాప్‌లో కీలక ప్రాధాన్యత కల్పించారు.

సురక్షిత డిజిటల్ పాలన లక్ష్యం..
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ మాట్లాడుతూ, సురక్షిత డిజిటల్ పాలన కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ APTS నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు (MeitY, CERT-In, NIC), పోలీస్ ఉన్నతాధికారులు అదిరాజ్ సింగ్ రానా IPS, , వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సురక్షితమైన డిజిటల్ పాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు.








