అమర్ నాథ్ మంచు లింగం త్వరగా కరిగిపోతోందా? కారణాలు ఏంటి?
మన దేశంలో వాతావరణ మార్పులు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షాలు సరిగ్గా పడటం లేదు. ఇంకా ఎండలు, ఉక్కపోత అలాగే వున్నాయి. ఎల్ నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు స్పష్టంగా పేర్కొంటున్నాయి. దీని ప్రభావం పంటలు, వ్యవసాయం, ప్రజలపై పడుతోంది.
కేవలం వీరిపైనే కాదు, అమరనాథ్ మంచులింగంపై కూడా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. తాజాగా అమరనాథ్ యాత్ర ప్రారంభమై వారం రోజులే అయ్యింది. ఈ వారం రోజులకే మంచు లింగం కరిగిపోవడం కనిపిస్తోంది. భారీగా మంచు లింగం కరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికి కొంత మంది భక్తులు మాత్రమే మంచు లింగాన్ని దర్శనం చేసుకున్నారు. ఇంకా చాలా మంది మిగిలిపోయారు.
సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తున్న అమరనాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకూ సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది. అయితే.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, వేడి వాతావరణం, వేడి గాలుల కారణంగా గుహలోని వాతావరణం కూడా మారిపోతోందని, అందుకే అమర్ నాథ్ శివలింగం కూడా కరిగిపోతోందని అంటున్నారు.
మరోవైపు మంచు శివలింగం యాత్ర ప్రారంభమైన మొదటి వారంలోనే కరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ‘శ్రీ అమర్నాథ్ బర్ఫానీ లంగర్స్ ఆర్గనైజేషన్’ (SABLO), ఈ పరిణామంపై సమగ్ర శాస్త్రీయ విచారణ జరపాలని కోరింది.
సహజంగా ఏర్పడిన మంచు లింగాన్ని మరియు ఆలయ పరిసరాల్లోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించేందుకు పర్యావరణ పరిరక్షణ చర్యలను బలోపేతం చేయాలని కూడా ఆ సంస్థ అధికారులను కోరింది.








