ఆంధ్రప్రదేశ్ సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి లోకేష్
హెడ్ డి కోస్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్వోన్ యంగ్హూన్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియా పెట్టుబడుల యాత్రలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్ డి కొరియా షిప్‌బిల్డింగ్ & ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ (HD KOSE) గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్వోన్ యంగ్హూన్ (Mr. Kwon Younghoon), టీమ్ లీడర్ హోంగ్ సున్జూన్ (Mr. Hong Sunjoon)లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సముద్ర రవాణా, షిప్‌బిల్డింగ్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… పారిశ్రామిక, ఆప్ షోర్ ఇంజనీరింగ్ స్థాపనకు ప్రపంచస్థాయి అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. సుమారు 1053 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతంతో భారత తూర్పు తీరంలో ఏపీ వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టులతోపాటు కొత్తగా రాబోయే డీప్-వాటర్ పోర్టులు, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూల పాలసీలు ఏపీ ప్రత్యేకతలుగా చెప్పారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టులను త్వరగా ఏర్పాటుచేయడానికి రూపొందించిన గవర్నెన్స్ మోడల్ అని తెలిపారు. ఇందుకు కియా మోటార్స్, దాని సరఫరా వ్యవస్థ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కొరియన్ కంపెనీలు సాధించిన విజయాలు ఉదాహరణ అని చెప్పారు. భారీ పారిశ్రామిక ప్రాజెక్టులను అతితక్కువ సమయంలో అమలుచేసిన చరిత్ర, సామర్థ్యం మా రాష్ట్రానికి ఉన్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఇతర ముఖ్య పెట్టుబడులను మంత్రి లోకేష్ తెలియజేస్తూ గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్‌మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్ట్ ఇటీవల ఏపీని ఎంచుకున్నాయి. ఇవి ప్రపంచ కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. భారతదేశంలోకి వచ్చే ఇన్వెస్టిమెంట్లలో సుమారు 25% పెట్టుబడులను ఆకర్షించి దేశంలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలిపారు. “హ్యుందాయి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని షిప్‌బిల్డింగ్ అవకాశాలను వివరించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనేక కొరియన్ కంపెనీలు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రికార్డ్ సమయంలో కార్యకలాపాలు ప్రారంభించాయి, వాటికి మా ప్రభుత్వం పూర్తి మద్దతు అందించింది. అలాగే మీరు కూడా ఏపిని సందర్శించి ఇక్కడ ఉన్న బహుళ అవకాశాలను పరిశీలించాలని నేను మీ టీమ్‌ను ఆహ్వానిస్తున్నాను.” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
హెచ్ డి కోస్ గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్వోన్ యంగ్హూన్ మాట్లాడుతూ… HD KOSE ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి షిప్‌బిల్డింగ్, సముద్ర ఇంజనీరింగ్ ఉపకరణాల కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. టెక్నికల్, లాజిస్టికల్, వాణిజ్య అవసరాల ఆధారంగా సరైన, అనుకూల ప్రాంతాలను గుర్తించి మా అధికారులు మీకు తెలియజేస్తారు. దీర్ఘకాలిక అభివృద్ధికి అవసరమైన సరైన ఎకోసిస్టమ్ ఆంధ్రప్రదేశ్ అందజేయగలదని మేము బలంగా విశ్వసిస్తున్నాం,” అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధి విజన్, పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల వ్యాపార వాతావరణాన్ని సృష్టించే తీరును ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకునేందుకు, మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు ఏపీ రావాల్సిందిగా మంత్రి లోకేశ్ HD KOSE నాయకత్వాన్ని ఆహ్వానించారు.








