ఏ ఒక్కరినీ తప్పించట్లేదు.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: కృష్ణబాబు
ఆర్టీసీ (RTC)ని ప్రైవేటీకరిస్తున్నారన్న వదంతులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని రవాణాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ( Krishna Babu) తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో 750 ఎలక్ట్రిక్ బస్సులు (Electric buses) ప్రవేశపెడుతున్నాం. కేంద్ర విధానాన్నే ఏపీలోనూ అమలు చేస్తున్నాం. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం లేదు. సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. 11 నగరాల్లో పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కింద బస్సులు నడుపుతున్నాం. రూ.1,774 కోట్లు ప్రోత్సాహకాల రూపంలో వస్తాయి. రాష్ట్ర ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లుగా ఆర్టీసీ ఉద్యోగులే (Employee) ఉంటారు. ఏ ఒక్క ఉద్యోగినీ తప్పించడం లేదు. సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుంది. సంస్థ ఆస్తులు విక్రయించడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయడం లేదు. ఆర్టీసీ సిబ్బంది జీతాలు, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని అన్నారు.








