చార్లెట్ కన్వెన్షన్ వేదికగా టీటీఏ మహాసభలకు అంతా సిద్ధం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) మెగా కన్వెన్షన్ 2026 ను అమెరికాలోని నార్త్ కరోలినా, ఛార్లెట్ నగరంలో జూలై 17 నుండి 19 వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకోసం ఏర్పాట్లు అంతా పూర్తి చేశారు. ఈ మహాసభలకు తెలంగాణ నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ కళాకారులు, జానపదగాయనీ గాయకులు, సాహితీవేత్తలు, బిజినెస్ ప్రముఖులు తరలివస్తున్నారు. తెలుగు సంస్కృతి, వ్యాపారం, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రతిష్టాత్మక మహాసభలకోసం కొన్ని నెలల ముందే కమిటీలను ఏర్పాటు చేశారు. దాదాపు 35 కమిటీలు ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్నాయి. మహాసభల్లో ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలు, వచ్చినవారికి వసతులు, భోజన ఏర్పాట్లు, ఇలా అన్ని విషయాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ పనులను చేస్తున్నారు.
ప్రముఖుల రాక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులను, నాయకులను, ఇతర పార్టీల నాయకులను మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
సినీరంగం నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ ఈ మహాసభలకు వస్తున్నారు. వీరితోపాటు పలువురు గాయనీ గాయకులు కూడా వస్తున్నారు.
వీరితోపాటు ప్రముఖ డాక్టర్లు గురవారెడ్డి, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేణుమాధవ్ రెడ్డి, బిజినెస్ ప్రముఖులు డా. ఎం.ఎస్. రెడ్డితోపాటు పలువురు సినీనటీనటులు కూడా ఈ మహాసభలకు వస్తున్నారు.
మహాసభలకు హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకులు సందీప్ వంగ, రామ్ గోపాల్ వర్మ, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, విశ్వ ప్రసాద్, నవీన్ ఎర్నేని తదితరులు వస్తున్నారు. అలాగే కామెడీ యాక్టర్, హీరో సునీల్, సుబ్బరాజు సందీప్ కిషన్ కూడా వస్తున్నారు. పలువురు కళాకారులు కూడా వస్తున్నారని నిర్వాహకులు చెప్పారు.
ముఖ్య కార్యక్రమాలు
బాంక్వెట్ రోజు ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ వాళ్ళ సంగీత విభావరి ఉంటుంది. తరువాతిరోజు థియరీ బ్యాండ్ వాళ్ళ సంగీత విభావరి, చివరిరోజున ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి ఉంటుంది. పరంపర నృత్యకళాకారిణులు ప్రత్యేక నృత్య కార్యక్రమాలు, గ్రెగొరి హ్యాంకాక్ డ్యాన్స్ థియేటర్ వారి నృత్యకార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు మహాసభల్లో ఏర్పాటు చేశారు. సాహిత్య కార్యక్రమాలను కూడా ఆకట్టుకునేలా నిర్వహిస్తున్నారు. ఇండియా నుండి వస్తున్న ప్రముఖ జానపద కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రస్మయి బాలకిషన్, మిట్టపల్లి సురేందర్, నల్గొండ గద్దర్, నరసింహా రెడ్డి తదితరులతో తెలంగాణ ఫోక్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంగీత దశావధానం పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సంగీత దిగ్గజం శ్రీ శరత్ చంద్ర పాల్గొంటున్నారు. అలాగే గేయకారులకు గీతాంజలి పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ప్రఖ్యాత గీత రచయిత, గాయకుడు మరియు సంగీత దర్శకుడు శ్రీ కాసర్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో, శ్రీమతి శారదా అకునూరి మరియు ధీరజ్ గారి ప్రదర్శనలు ఉంటాయి. సాహిత్యోపణ్యసుముపేరుతో మరో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇందులో ప్రముఖ హృద్రోగ నిపుణులు మరియు సాహిత్య పండితులు డా. అల్లా శ్రీనివాస్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. జానపద మరియు సాంప్రదాయ గీతాలు కార్యక్రమంలో బహుముఖ గాయని మరియు పేరడీ నిపుణురాలు డా. అరుణా సుబ్బారావు గారు పాటలు పాడనున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. షార్లెట్ వీధుల్లో జరిగే భారీ శోభాయాత్రలో ఇండియా నుండి ప్రత్యేకంగా వస్తున్న పోతరాజు విన్యాసాలు, బోనాలు, బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించనున్నారు. స్థానిక మరాఠీ, తమిళ సంఘాలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం విశేషం.
పొలిటికల్ ఫోరమ్‌లో భాగంగా ‘ఆల్ పార్టీ పొలిటికల్ డిబేట’ మరియు ‘మీట్ అండ్ గ్రీట’ కార్యక్రమాలను నిర్వహించనున్నాము. ఈ చర్చా వేదికలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు వివిధ పార్టీల ముఖ్య నేతలు అమెరికా రానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఆరఅండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి), దనసరి సీతక్క (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి), జి. జగదీష్ రెడ్డి (ఎమ్మెల్యే), చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ), రఘునందన్ రావు (ఎంపి), చామకూర మల్లారెడ్డి (ఎమ్మెల్యే), జగదీశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి (ఎమ్మెల్యే), మర్రి రాజశేఖర్ రెడ్డి (ఎమ్మెల్యే), బండారి లక్ష్మారెడ్డి (ఎమ్మెల్యే). తదితరులు రానున్నట్లు సమాచారం. యూత్ బాంక్వెట్ కార్యక్రమాలు కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు యువత ఒకచోట చేరి పరిచయాలు పెంచుకోవడానికి గొప్ప వేదిక కానుంది.
మొత్తం మీద ఈ మహాసభలు అందరికీ నచ్చేలా కార్యక్రమాలు, సౌకర్యంగా తిలకించేలా ఏర్పాట్లను టిటిఎ మహాసభల నిర్వాహకులు చేస్తున్నారు.
టిటిఎ మెగా కన్వెన్షన్ వేదిక
ఎంతో సౌకర్యవంతమైన, దాదాపు 6,000,000 చదరపు అడుగుల వైశాల్యం గల ‘ఛాÍర్లెట్ కన్వెన్షన్ సెంటర’ టిటిఎ మెగా మహాసభలకు వేదికగా నిలిచింది. ‘నాస్కార్ హాల్ ఆఫ్ ఫేమ’తో అనుసంధానించబడి ఉంది. అలాగే 700 గదుల వసతి కలిగిన ‘వెస్టిన్ హోటల’కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. నాలుగు విభాగాలుగా విభజించదగిన 2,80,000 చదరపు అడుగుల విశాలమైన ఎగ్జిబిషన్ హాల్ స్పేస్‌తో పాటు, రెండు పెద్ద బాల్ రూమ్‌లతో కూడిన 1,54,000 చదరపు అడుగుల బ్రేకఅవుట్ స్పేస్ కూడా ఈ కన్వెన్షన్ సెంటర్లో అందుబాటులో ఉంది. ఈ కన్వెన్షన్ సెంటర్ ముఖద్వారం వద్దే కళలు, సంస్కృతికి సంబంధించిన ఆకర్షణలు, క్రీడా వేదికలు, నైట్‌లైఫ్ హబ్‌లు మరియు సందర్శకులను అలరించడానికి 200కు పైగా రెస్టారెంట్లతో కూడిన సందడిగల నగర వాతావరణం అందరికీ స్వాగతం పలుకుతుంది. ప్రపంచంలోనే టాప్-10 అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన ‘షార్లెట్ డౌగ్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం’ నుండి ఇది కేవలం ఏడు మైళ్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుండి నడిచి వెళ్లగలిగే దూరంలోనే సుమారు 6,400 హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 1,800 మంది కూర్చుని భోజనం చేయగల (బాంక్వెట్ సీటింగ్) సామర్థ్యం ఉన్న 35,000 చదరపు అడుగుల (3300 చదరపు మీటర్లు) బాల్రూమ్, ఇన్-హౌస్ క్యాటరింగ్ వసతి మరియు బాల్‌రూమ్‌కు అదనపు స్థలాన్ని చేకూర్చే ప్రీ-ఫంక్షన్ ఏరియా ఇక్కడ ఉన్నాయి. షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో సెంట్రలైజ్డ్ ఆడియో రికార్డింగ్, చక్కటి వెలుతురు మరియు పోడియంల వంటి అత్యాధునిక సాంకేతిక వసతులు ఉన్న 46 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. ఈ వెన్యూలో ఇప్పుడు టిటిఎ మహాసభలు జరగనున్నాయి.
భారీ ఎలఇడి స్క్రీన్లు…
మహాసభలకు వచ్చేవారు హాయిగా కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా భారీ స్క్రీన్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకులకు విజువల్స్ మరియు సౌండ్ క్వాలిటీ అద్భుతంగా అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 80 అడుగుల వెడల్పు, 48 అడుగుల లోతు మరియు 4 అడుగుల ఎత్తుతో ఒక మెగా స్టేజ్‌ను నిర్మిస్తున్నారు. స్టేజ్ మీద 64 అడుగుల భారీ ఎలఈడి వాల్స్‌తో పాటు, హాల్లో ఎక్కడ కూర్చున్నా స్పష్టంగా కనిపించేలా లెఫ్ట్, రైట్ సైడ్స్ రెండు పెద్ద ఐమాక్స్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్ ఎంట్రన్స్, డైనింగ్ ఏరియా, రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఇలా జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మొత్తం 26 డిజిటల్ ఎలఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఏ రూమ్‌లో ఏ కార్యక్రమం జరుగుతోంది, స్పాన్సర్స్ మరియు డోనర్స్ వివరాలు నిరంతరం తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెనుక వరుసల్లో ఉన్న వారికి కూడా అంతరాయం లేకుండా చూసేందుకు రెండు ప్రత్యేక డిలే స్క్రీన్స్, అదనపు స్పీకర్లు మరియు ఎఫఓహెచ్ వద్ద ఒక రౌండ్ సర్క్యులర్ స్క్రీన్‌ను కూడా అమర్చుతున్నారు.
సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు
డా. పైళ్ళ మల్లారెడ్డి, టిటిఎ వ్యవస్థాపకులు
అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు తెలంగాణ కమ్యూనిటీని ఒకే వేదికపై తీసుకురావడంలో కృషి చేసిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఇటీవలే దశమ వార్షికోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇప్పుడు మహాసభలను అంగరంగ వైభవంగా ఛార్లెట్ నగరంలోని ఛార్లెట్ కన్వెన్షన్ వేదికగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మన తెలంగాణ కళాకారులను గౌరవించేలా వారిని తెలంగాణ నుంచి ఇక్కడకు రప్పించి ప్రదర్శనలు ఇప్పిస్తున్నాము. అదేవిధంగా అమెరికాలోని తెలంగాణ కళాకారులకు కూడా ఈ మహాసభలు వారి ప్రదర్శనలకు వేదికగా నిలుస్తున్నాయి. అమెరికాలోని తెలుగువారికి ఉపయోగపడేలా కూడా చర్చాగోష్టులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో పేరుగాంచిన ఎంతోమంది ఈ మహాసభల్లో పాల్గొనడంతోపాటు తమ అనుభవాలను తెలియజేయనున్నారు. ఆధ్యాత్మిక అనుభూతులను పంచేలా తిరుమలలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా శ్రీనివాస కళ్యాణంను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టిటిఎ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. అమెరికాలోని యువ తరానికి మన తెలుగు, తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మహాసభల విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.
తెలంగాణవాసులను ఒకే వేదికపైకి..
డా. విజయ్‌పాల్ రెడ్డి, అడ్వయిజరీ కమిటీ చైర్
ఛార్లెట్‌లోని ఛార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరగనున్న మహాసభలను తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నాము. ఈ మహాసభల కోసం ఏర్పాటు చేసిన దాదాపు 35కిపైగా కమిటీలు ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత ఆధ్వర్యంలో కొద్ది నెలలుగా కార్యక్రమాలపై చర్చిస్తూ, తుదిరూపాన్ని తీసుకువచ్చాయి. అందరికీ నచ్చేలా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. అలాగే తెలంగాణ కవులు, కళాకారులను ఈ మహాసభలకు ఆహ్వానించాము. అమెరికాలో ఉన్న తెలంగాణవాసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఈ మహాసభల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాసభలకోసం ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులను, వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించాము. ఈ మహాసభల నిర్వహణలో భాగంగా వివిధ నగరాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చాయి. ఈ వేడుకలపై ఎంతోమంది ఆసక్తి చూపించడం టిటిఎకు కమÖ్యనిటీలో ఉన్న ఆదరణను తెలియజేస్తోంది. ఈ ఆదరణ మరింత పెరిగేలా ఈ మహాసభల వేడుకలు కూడా ఉంటాయి. అందరూ ఈ మహాసభలకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను.








