ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాల చట్టబద్ధతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర సందేహాలను, అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదం లేకుండా, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వందల, వేల కోట్ల ప్రజాధనాన్ని ఏ విధంగా పంపిణీ చేస్తారని న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నిలదీశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.
న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా ఈ విచారణ సాగింది. చట్టసభ ఆమోదం లేకుండా కేవలం 8 జీవోల ఆధారంగా ప్రజాధనాన్ని ఉచిత పథకాలకు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 245, 246ల ఉల్లంఘన కిందికే వస్తుందని వాదించారు. చట్టపరమైన నిబంధనలు, శాసనసభ పర్యవేక్షణ లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ, ఈ పథకాలకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని కోరారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కోర్టు గుర్తు చేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదని, కాంట్రాక్టర్ల బిల్లులు, భూసేకరణకు సంబంధించిన పరిహారాలు భారీగా పెండింగ్లో ఉన్నాయని న్యాయస్థానం ఎత్తిచూపింది.
ఇవి కూడా చదవండి
“రాష్ట్రం అప్పుల్లో ఉండి, కనీస చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ఈ ఉచిత పథకాలను ఎవరు అడిగారు?” అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వం వద్ద అదనపు నిధులు, మిగులు బడ్జెట్ ఉంటే సంక్షేమ పథకాలు లేదా ఉచితాలు ఇవ్వడంలో తప్పు లేదని, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రాధాన్యత ఉండాలని కోర్టు హితవు పలికింది. 2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 13,484 కోట్లు ఖర్చు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నప్పటికీ, పర్యవేక్షణ లోపం వల్ల అనర్హుల చేతుల్లోకి నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. కాగ్ నివేదికల ప్రకారం.. సుమారు రూ. 90 కోట్లు అనర్హుల పాలయ్యాయని కోర్టుకు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నారు.
అయితే, ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ఈ వాదనలను తోసిపుచ్చారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే సామాజిక బాధ్యతతోనే ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందని, పేదల సంక్షేమాన్ని విస్మరించలేమని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు, ఈ పథకాలపై తక్షణ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, దీనిపై సమగ్ర వివరణ ఇవ్వడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.
ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ఎరగా వేస్తున్నాయనే విమర్శలు వ్యూహాత్మకంగా వినిపిస్తున్న తరుణంలో, హైకోర్టు ఈ అంశాన్ని చట్టబద్ధత కోణంలో ప్రశ్నించడం అత్యంత ప్రాధాన్యతను సంతరింపజేసుకుంది. మరి ప్రభుత్వం చట్టసభ ఆమోదం అంశంపై న్యాయస్థానానికి ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








