కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే, ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీటి కంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ వేడే ఎక్కువగా కనిపిస్తోంది. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్న తరుణంలో మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే.. ఇప్పుడు గనుక పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టు బ్యారేజీలే కుప్పకూలుతాయని అధికార కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. ఈ ప్రచార యుద్ధం వెనుక అసలు నిజాలేంటి? సాంకేతిక నివేదికలు ఏం చెబుతున్నాయి?
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ప్రధాన వాదన ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లు, బాహుబలి మోటార్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. కేవలం కొన్ని బ్యారేజీల పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. వరద నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా, పంపింగ్ సిస్టమ్‌ను తక్షణమే ఉపయోగించి మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి ప్రధాన రిజర్వాయర్లను నింపాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో, కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక వ్యర్థ కట్టడంగా చిత్రించేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక ఆధారాలతో తిప్పికొడుతోంది. పంప్ హౌస్‌లు బాగున్నాయన్నది నిజమే కావొచ్చు, కానీ వాటికి నీటిని అందించాల్సిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునాదులు కదిలిపోయాయన్నది నగ్న సత్యమని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. దీనికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన గైడ్‌లైన్స్, మధ్యంతర నివేదికలను చూపిస్తోంది.
గత ఏడాది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలో ఊటలు రావడం వంటి తీవ్రమైన ఘటనల తర్వాత ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగకుండా, పునాదుల కింద గ్రౌటింగ్ పూర్తికాకుండా బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒకవేళ బలవంతంగా నీటిని నిల్వ ఉంచితే ఏర్పడే ‘హైడ్రోస్టాటిక్ ప్రెజర్’ కారణంగా మిగిలిన పిల్లర్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బ్యారేజీలో నీరు నిలిస్తేనే పంపుల ద్వారా ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. కాబట్టి, పునాదులే కదిలిన చోట నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని చూడడం ఆత్మహత్యాసదృశ్యమేనని అధికార పక్షం వాదిస్తోంది.
ఈ ప్రచార యుద్ధానికి తెరదించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి ఒక బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, అడ్డగోలు ఖర్చులు, ప్రస్తుత దుస్థితిపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైన లైవ్ చర్చకు రావాలని సవాల్ చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ వివరాలు, సాంకేతిక తప్పిదాలను ప్రజల ముందు ఉంచి.. రీ-డిజైనింగ్ పేరిట జరిగిన వేల కోట్ల రూపాయల వ్యయం వెనుక ఉన్న అసలు నిజాలను నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
ఈ సవాల్‌పై హరీష్ రావు సానుకూలంగానే స్పందించినప్పటికీ, గతంలో కాళేశ్వరంపై జరిగిన లఘు చర్చలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకాలేదు. ఒకవేళ ఈసారి అసెంబ్లీలో గనుక పూర్తిస్థాయి పోరు జరిగితే, అది ఉభయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ‘చావో రేవో’ లాంటి పరిస్థితిగా మారుతుంది. తాము నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ చేతకానితనంతోనే వదిలేసిందని నిరూపించాలని బీఆర్ఎస్.. లేదు ఇది కేవలం ‘కమీషన్ల స్కామ్’ మాత్రమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా సాగే ట్వీట్లు, కౌంటర్ ట్వీట్ల పొలిటికల్ డ్రామా వల్ల తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. అసెంబ్లీ సాక్షిగా, నిపుణుల సమక్షంలో పారదర్శకమైన చర్చ జరిగి, ఎన్డీఎస్ఏ నివేదికలోని సాంకేతిక అంశాలు ప్రజల ముందుకు వచ్చినప్పుడే.. వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవిష్యత్తుపై ఒక స్పష్టత వస్తుంది.








