“నేనెందుకు వివరణ ఇస్తా?”.. కొండా సురేఖకు కడియం శ్రీహరి ఘాటు కౌంటర్!
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు పేజీల సుదీర్ఘ లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాలో సంచలనంగా మారింది. తనకు సమాచారం లేకుండా, తన పరిధిలోని దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించారన్నది సురేఖ ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంతే ఘాటుగా స్పందించారు. కొందరు కాంట్రవర్సీలు చేస్తూనే ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారంటూ మంత్రి కొండా సురేఖ పేరు ఎత్తకుండానే పరోక్షంగా చురకలు అంటించారు.
బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమావేశం కావడం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ.. శాఖా మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా కడియం సమీక్ష జరిపారని ఆరోపించారు. దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ, నిధుల కేటాయింపులపై అధికారులకు గడువులు విధించడం మంత్రి అధికారాలను బేఖాతరు చేయడమేనని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది పరిపాలనా లోపమే కాకుండా అధికార యంత్రాంగంలో అయోమయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, పార్టీ క్రమశిక్షణా కమిటీ స్థాయిల్లో దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చేశారు.
మంత్రి సురేఖ ఫిర్యాదుతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “నేను ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేనెందుకు వివరణ ఇస్తాను?” అని కడియం ప్రశ్నించారు. కొందరికి కొత్త అలవాట్లు నేర్చుకోవడం పరిపాటిగా మారిందని, నిరంతరం వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలవడమే వారి ధ్యేయమంటూ సురేఖ వైఖరిని తప్పుపట్టారు. దేవాదాయ శాఖపై అధికారిక సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదనే కనీస పరిపాలనా నియమాలు ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో తనకు తెలుసునని కడియం స్పష్టం చేశారు. అధికారులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడితే అది సమీక్ష అవుతుందని, కానీ తానే స్వయంగా వెళ్లి దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిశానని వివరించారు.
తన పరిధిని దాటి తాను ఎప్పుడూ వ్యవహరించలేదని కడియం శ్రీహరి తేల్చిచెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆలయాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే తాను అధికారులను కలిశానని, తన నియోజకవర్గ పరిధి దాటి ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి కానీ, రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి కానీ తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ ప్రయోజనాల కోసమే విన్నపాలు చేశానని, ప్రజా ప్రతినిధిగా తన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానని కడియం కుండబద్దలు కొట్టారు.
మంత్రి కొండా సురేఖ రాసిన మూడు పేజీల లేఖ కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపగా, దానికి కడియం శ్రీహరి ఇచ్చిన వివరణాత్మక కౌంటర్ ఈ అంతర్గత పోరును మరింత ముదిరేలా చేసింది. ఈ ఇద్దరు సీనియర్ల పంచాయతీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో, అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.








