తెలంగాణ కాంగ్రెస్‌లో ‘పవర్ వార్’!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా అంతర్లీనంగా సాగుతున్న అధికార ఆధిపత్య పోరు ఇప్పుడు బహిర్గతమై పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, కేంద్రీకృత పాలనా శైలి క్యాబినెట్ సహచరుల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. కీలక వ్యవహారాల్లో తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తమను కాదని ఇతర నేతలను సీఎం ప్రోత్సహిస్తున్నారనే భావన సీనియర్ మంత్రుల్లో గట్టిగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖల తాజా వ్యూహాత్మక అడుగులు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టడమే కాకుండా, వివాదాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లాయి.
ఈ అంతర్గత రచ్చకు మొదటి కేంద్రబిందువుగా మారారు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు. తన పరిధిలోకి రాని ఆర్థిక శాఖా పరమైన అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఆయన విసిరిన బహిరంగ సవాల్ చివరకు కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. తెలంగాణ భవన్‌కు వస్తానంటూ జూపల్లి చేసిన ఛాలెంజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు.
ఇవి కూడా చదవండి
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “వ్యక్తిగతంగా సవాల్ విసిరినప్పుడు నేరుగా వెళ్లి తేల్చుకోవాలి కానీ, మొత్తం పార్టీని డిఫెన్స్‌లో పడేయడం ఏంటి?” అని అంతర్గత సమావేశాల్లో అసహనం వ్యక్తం చేసినట్లు లీకులు వచ్చాయి. సీఎం వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన జూపల్లి, సోమవారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పర్యాటక శాఖ అధికారిక సమీక్షా సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టారు. అంతటితో ఆగకుండా, అదే సమయంలో కొల్లాపూర్ బావిలో తాను హ్యాపీగా ఈత కొడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో వదలడం ద్వారా.. తానేంటో సీఎంవోకు పరోక్షంగా ఒక బలమైన పొలిటికల్ సిగ్నల్ పంపారు.
మరోవైపు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కడియం శ్రీహరి ప్రాధాన్యతను వ్యతిరేకిస్తూ ఆమె గతంలోనే అసంతృప్తి లేఖ రాసినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి కడియంకు వెన్నుదన్నుగా నిలవడం ఆమెకు మింగుడుపడటం లేదు. దీనికి తోడు, తన పరిధిలోని దేవాదాయ శాఖకు చెందిన అత్యంత కీలకమైన యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం వంటి నిర్ణయాల్లో కనీసం మంత్రిగా ఉన్న తనకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా సీఎంవో ఏకపక్షంగా ఆర్డర్స్ పాస్ చేయడం ఆమెను తీవ్ర అవమానానికి గురిచేసింది. ఇప్పటికే వరంగల్ గ్రూపు రాజకీయాల్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, స్థానిక ఎమ్మెల్యేలతో కొండా కుటుంబానికి గ్యాప్ నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా సీఎంవోనే తన శాఖలో నేరుగా జోక్యం చేసుకోవడంపై తీవ్ర కలత చెందిన కొండా సురేఖ.. రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ ఏఐసీసీ హైకమాండ్‌కు నేరుగా ఒక ఘాటు లేఖ రాయడానికి సిద్ధమవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్లో ఈ స్థాయి గ్యాప్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న కేంద్రీకృత అధికార శైలి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్లు, తాము రేవంత్ కంటే సీనియర్లమని భావించే మంత్రులు సీఎంవో నుంచి వచ్చే కఠిన ఆదేశాలను, నియామకాలను అంత సులభంగా తీసుకోలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు సైతం కొన్ని విషయాల్లో అసంతృప్తితో ఉన్నప్పటికీ, వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. కానీ, జూపల్లి, కొండా సురేఖలు మాత్రం తమ అసంతృప్తిని ప్రత్యక్షంగా, పరోక్షంగా బయటపెట్టి తిరుగుబాటు జెండా ఎగరేశారు.
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సొంత క్యాబినెట్ సహచరుల మధ్య సమన్వయం దెబ్బతినడం, ఏకంగా ఢిల్లీ అధిష్ఠానానికి లేఖలు రాసే పరిస్థితి రావడం రేవంత్ రెడ్డి లీడర్షిప్కు ఒక సవాల్‌గా మారింది. మరి ఈ అంతర్గత మంటలను చల్లార్చడానికి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తారా.. లేక రాబోయే రోజుల్లో జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఈ అసంతృప్త నేతలకు గట్టి చెక్ పెడతారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.








