3 నెలలు మంత్రిని చెయ్యి.. నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు, చేసిన విమర్శలకు బీఆర్ఎస్ పక్షాన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన సాంకేతిక ఆధారాలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఊహించని, సంచలన సవాల్‌ను హరీష్ రావు విసిరారు.
“రేవంత్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి కేసీఆర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు మూడేళ్లు కూడా వద్దు, కేవలం మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించు. నిబంధనల ప్రకారం, క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ పద్ధతుల్లో నీళ్లు ఎలా ఎత్తిపోయాలో, రైతులకు నీళ్లు ఎలా తేవాలో నేను ప్రాక్టికల్‌గా చూపిస్తా” అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. మిడిమిడి జ్ఞానంతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇకనైనా ఆపాలని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
గత కాంగ్రెస్ హయాంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆనాడు తుమ్మిడిహట్టి వద్దే బ్యారేజీ ఎందుకు నిర్మించలేదో వివరిస్తూ కేంద్ర జల సంఘం రాసిన మూడు అధికారిక లేఖలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్ర తదితర ప్రాంతాల నీటి అవసరాలు, వినియోగం నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఆనాడే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలిపిందని గుర్తుచేశారు.
అంతేకాకుండా, ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి.. తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి తాము ఎంతమాత్రం ఒప్పుకోబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాశారని హరీష్ రావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పిన తర్వాత కూడా, ఇంకా తుమ్మిడిహట్టి జపం చేయడం కాంగ్రెస్ నేతల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో, శాస్త్రీయంగా రీసెర్చ్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసిందని ఆయన సమర్థించుకున్నారు.
కట్టిన ఏడాది నుంచే కాళేశ్వరం సమస్యలు వచ్చాయని సీఎం అనడం హాస్యాస్పదమని హరీష్ రావు కొట్టిపారేశారు. ప్రకృతి వైపరీత్యాలు, వరద తీవ్రత వల్ల సాంకేతిక లోపాలు వస్తే వాటిని యుద్ధప్రాతిపదికన రిపేర్ చేసి రైతులకు నీరివ్వాల్సింది పోయి.. ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టేసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును నిలబెట్టాలనే చిత్తశుద్ధి రేవంత్ సర్కార్‌కు ఉంటే.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గైడ్‌లైన్స్ సాకుతో కాలయాపన చేయకుండా వెంటనే పంపింగ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అసెంబ్లీ జాయింట్ సెషన్ చర్చకు బీఆర్ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. “మేము చర్చ నుంచి పారిపోయేవాళ్లం కాదు. నువ్వు స్పీకర్‌కు లేఖ రాసి రేపే తేదీ ఖరారు చేయి. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన మోసాలను, అబద్ధాలను ఆధారాలతో సహా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం” అని తేల్చి చెప్పారు.
తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు తమను ‘ఆర్థిక ఉగ్రవాదులు’ అంటూ నీచమైన పదజాలంతో దూషిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజల హృదయాల్లో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని ఆయన ముగించారు. హరీష్ రావు విసిరిన ఈ కౌంటర్ ఛాలెంజ్‌తో తెలంగాణలో ఇరిగేషన్ పాలిటిక్స్ ఒక్కసారిగా మరింత హీటెక్కాయి.








