కడియం – కొండా లొల్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి!
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొండా-కడియం వైరం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వీరి మధ్య రాజకీయ శత్రుత్వం, ఈసారి ఏకంగా దేవాదాయ శాఖ వేదికగా భగ్గుమంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. మంత్రి కొండా సురేఖ పరిధిలోని దేవాదాయ శాఖపై ఏకపక్షంగా సమీక్ష నిర్వహించడం ఇప్పుడు తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామం అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిగా మారింది.
హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్షా సమావేశమే ఈ తాజా వివాదానికి కేంద్ర బిందువు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంత్రావుతో పాటు ఆర్జేసీ, ఏడీసీలు, ఇతర ఉన్నతాధికారులంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, సంబంధిత శాఖ మంత్రికి కనీస సమాచారం లేకుండా, ప్రధాన కార్యాలయానికి వచ్చి ఉన్నతాధికారులతో కీలక అంశాలపై సమీక్ష జరపడమే కాకుండా ఆదేశాలు జారీ చేయడం పరిపాలనా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం సాధారణ పరిపాలనా లోపం కాదని, తన మంత్రిత్వ శాఖ అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నమని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి మూడు పేజీల ఘాటైన లేఖ రాయడంతో పాటు, పార్టీ అధిష్ఠానానికి కూడా కడియం తీరుపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రిని పూర్తిగా విస్మరించి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం, మంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆదేశాలు ఇవ్వడం పరిపాలనా వ్యవస్థలో అత్యంత అనుచితమైన సంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
గతంలో కూడా కడియం శ్రీహరి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి, తనపై దుష్ప్రచారానికి ప్రయత్నించారని లేఖలో గుర్తు చేశారు. కడియం చర్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీతో విచారణ జరిపించి, ఆయన నుంచి వివరణ కోరాలని, భవిష్యత్తు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సురేఖ గట్టిగా డిమాండ్ చేశారు.
ఈ వివాదం కేవలం ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరమే కాకుండా, దేవాదాయ శాఖలో అధికారుల ఏకపక్ష వైఖరిని, మంత్రికి ఎదురవుతున్న వరుస పరాభవాలను కూడా బట్టబయలు చేసింది. గతంలోనూ మరో శాఖకు చెందిన మంత్రి దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించడంపై సురేఖ ఫిర్యాదు చేశారు. తాజా సమీక్ష విషయానికి వస్తే.. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఇతర విషయాలపై మంత్రిని కలిసినప్పటికీ, కడియం నిర్వహించిన సమీక్ష గురించి ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సమీక్షకు హాజరైన అధికారులు సైతం మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
ఇటీవల జరిగిన సరస్వతీ నది అంత్యపుష్కరాల పనుల్లో సైతం మంత్రికి తెలియకుండానే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, గతంలో మేడారం జాతర సమయంలోనూ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే శాఖపై పట్టు సాధించేందుకు ఆలయాల బడ్జెట్ జారీ అధికారాలను అధికారుల నుంచి తొలగించి, తన చేతుల్లోకి తీసుకోవడానికి సురేఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లా సీనియర్ నేతలైన కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరూ పార్టీకి కీలకమైన వారే. ఒకరు కేబినెట్ మంత్రిగా ఉంటే, మరొకరు సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం, ముఖ్యంగా శృతి మించుతున్న గ్రూపు రాజకీయాలను అదుపు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ వివాద నేపథ్యంలో, నిబంధనలు ఉల్లంఘించి సమీక్షకు హాజరైన దేవాదాయ శాఖ అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఈ కొండా-కడియం లొల్లికి రేవంత్ రెడ్డి ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి.








