ప్రవాసాంధ్రులకు పెద్దపీట… విదేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధుల నియామకం!
విదేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం శ్రేణులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కమిటీల నియామకాల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. ఈ క్రమంలో వివిధ దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. వీరికి ప్రభుత్వ సలహాదారులతో సమానమైన గౌరవమర్యాదలు, వేతనాలు , ఇతర సౌకర్యాలు వర్తిస్తాయి.
నియమితులైన ప్రముఖులు:
రావి రాధాకృష్ణ: ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే మధ్యప్రాచ్య (గల్ఫ్) దేశాలు , ఆగ్నేయ ఆసియా దేశాలకు ఇతను ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారు. కోనసీమ జిల్లా సఖీనేటిపల్లికి చెందిన రాధాకృష్ణ, సౌదీ అరేబియాలో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పారిశ్రామికవేత్త.
జయకుమార్ గుంటుపల్లి: ఐరోపా దేశాల బాధ్యతలను జయకుమార్ చూసుకుంటారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఆయన, బ్రిటన్ తెలుగు సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా సేవలు అందించడమే కాకుండా, పదేళ్లకు పైగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
శ్రీనివాస్ పల్లపోటు: ఆఫ్రికా, ఆస్ట్రేలియా , మిగిలిన దేశాలకు ఇతను ప్రతినిధిగా నియమితులయ్యారు. గుడివాడకు చెందిన శ్రీనివాస్ పల్లపోటు చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉంటూ, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
సతీష్ మండువ: ఉత్తర అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాల సమన్వయకర్తగా (లియాజన్ ఆఫీసర్) సతీష్ మండువను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన, అమెరికాలో మూడు దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తూ, పార్టీలోనూ చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, విదేశాల్లో ఉన్న తెలుగువారితో సమన్వయం పెంచుకోవడానికి , రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయడానికి ఈ నియామకాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.








