2026లో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలా? వద్దా? మార్కెట్ చెప్పిన 7 నిజాలు ఇవే!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఇంకో ఆరు నెలలు ఆగితే ఫ్లాట్ రేట్లు తగ్గుతాయా?”
2026లో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకునే ప్రతి కుటుంబంలో వినిపిస్తున్న ప్రశ్న ఇదే.
కొంతమంది…
“మార్కెట్ స్లో అయిపోయింది… ఆగుదాం” అంటున్నారు.
మరికొందరు…
“ఇప్పుడే కొనకపోతే మళ్లీ రేట్లు పెరుగుతాయి” అంటున్నారు.
మరి నిజం ఏంటి?
2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అమ్మకాలు ఎలా జరిగాయి?, ధరలు నిజంగానే పెరిగాయా?, గత ఏడాది ఇల్లు కొన్నవాళ్లు లాభపడ్డారా?, 2026లో కొత్తగా కొనాలనుకునేవాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలి? తాజా మార్కెట్ గణాంకాలు చెబుతున్న అసలు కథ ఇదే.
నిజం 1: మార్కెట్ కుప్పకూలలేదు… అమ్మకాలు పెరిగాయి
2025లో హైదరాబాద్‌లో మొత్తం 38,403 ఇళ్లు అమ్ముడయ్యాయి.
ఇది 2024తో పోలిస్తే 4 శాతం ఎక్కువ.
అంతేకాదు…
2025 రెండో అర్ధభాగంలో (జూలై–డిసెంబర్) మాత్రమే 19,355 ఇళ్లు అమ్ముడవ్వడం గమనార్హం. అంటే ఏడాది చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.
అంటే…
“హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయిపోయింది” అనే ప్రచారానికి గణాంకాల్లో ఆధారాలు కనిపించడం లేదు.
నిజం 2: ధరలు పడిపోలేదు… మరోసారి పెరిగాయి
చాలామంది ఎదురుచూసింది ఒక్కటే. “రేట్లు పడిపోతే కొందాం.” అని. కానీ 2025లో అది జరగలేదు. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ఇళ్ల సగటు ధరలు ఏడాదిలో సుమారు 13 శాతం పెరిగాయి.
అంటే… 2025 ప్రారంభంలో ఇల్లు కొనుగోలు చేసిన చాలామందికి ఏడాది చివరికి ఆస్తి విలువ పెరిగినట్లే.
నిజం 3: అన్ని ప్రాంతాలు ఒకేలా లేవు… కొన్ని ఏరియాలే మార్కెట్‌ను లీడ్ చేశాయి
హైదరాబాద్ మొత్తం ఒకే మార్కెట్ కాదు. 2025లో ఎక్కువ డిమాండ్ కనిపించిన ప్రాంతాలు ఇవి:
కొకాపేట్
నర్సింగి
గచ్చిబౌలి
కొండాపూర్
పుప్పాలగూడ
నానక్‌రామ్‌గూడ
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
తెల్లాపూర్
ఈ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగాలు, ORR కనెక్టివిటీ, కొత్త ఆఫీస్ స్పేస్‌లు, అంతర్జాతీయ పాఠశాలలు, ఆస్పత్రులు డిమాండ్‌ను నిలబెట్టాయి.
ఇవి కూడా చదవండి
నిజం 4: రూ. 1 కోటి పైబడిన ఇళ్లకు డిమాండ్ మరింత పెరిగింది
“లగ్జరీ హౌసింగ్‌కు డిమాండ్ తగ్గింది” అనుకునేవారికి గణాంకాలు షాక్ ఇస్తాయి. 2025లో రూ. 1 కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 35% పెరిగాయి. డిసెంబర్ ఒక్క నెలలోనే… ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు 37% పెరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్ విలువలో దాదాపు 48% వాటా ఈ హై-వాల్యూ ఇళ్లదే.
నిజం 5: కొత్త ప్రాజెక్టులు తగ్గాయి… కానీ అమ్మకాలు తగ్గలేదు
2025లో హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన హౌసింగ్ ప్రాజెక్టులు 7% తగ్గి 40,737 యూనిట్లకు చేరాయి. అంటే… బిల్డర్లు కూడా ఇప్పుడు విచక్షణ లేకుండా ప్రాజెక్టులు ప్రారంభించడం లేదు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనే కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు.
నిజం 6: అమ్ముడుపోని ఇళ్లు ఇంకా చాలానే ఉన్నాయి
ఇది కూడా నిజమే. 2025 చివరికి హైదరాబాద్‌లో 54,878 ఇళ్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. అంటే… మార్కెట్లో అవకాశాలు లేవని కాదు. కొనుగోలుదారులకు ఎంపికలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అయితే ఈ ఇన్వెంటరీ అంతా ఒకే ప్రాంతంలో లేదు. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు వేగంగా జరుగుతుంటే… కొత్తగా అభివృద్ధి చెందుతున్న కొన్ని కారిడార్లలో సరఫరా డిమాండ్ కంటే ఎక్కువగా ఉంది.
నిజం 7: 2026లో కొనాలా? వద్దా?
ఒకవేళ మీరు… సొంతంగా ఉండటానికి ఇల్లు కొనాలనుకుంటే…కనీసం 7–10 సంవత్సరాలు అక్కడే ఉండే ప్లాన్ ఉంటే… లోన్ EMI మీ ఆదాయానికి భారంగా లేకపోతే… 2026లో కొనడం తప్పు నిర్ణయం కాదు. కానీ… “మూడేళ్లలో రెట్టింపు అవుతుంది” అనే ఆశతో కొనాలనుకుంటే మాత్రం జాగ్రత్త అవసరం. ఇప్పటి మార్కెట్లో అలా ప్రతి ప్రాజెక్టు పరుగులు తీయడం లేదు.
చివరి మాట
2025 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకు మూడు విషయాలు నేర్పింది.
మొదటిది… మార్కెట్ కుప్పకూలలేదు.
రెండోది… ధరలు తగ్గలేదు.
మూడోది… మంచి లొకేషన్ ఉన్న ప్రాజెక్టులకు ఇప్పటికీ డిమాండ్ బలంగానే ఉంది.
అందుకే 2026లో అసలు ప్రశ్న…
“ఇల్లు కొనాలా?” కాదు.
“ఎక్కడ కొనాలి?”
కొకాపేటా?
నర్సింగినా?
గచ్చిబౌలినా?
తెల్లాపూరా?
లేక…
ఇంకా ఎదుగుతున్న మరో కారిడార్లోనా?
ఈ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం దొరికితే… 2026లో మీరు తీసుకునే రియల్ ఎస్టేట్ నిర్ణయం, వచ్చే పదేళ్ల మీ సంపదను కూడా ప్రభావితం చేయొచ్చు.








