ఇంక కరెంట్ కోత అనే మాటే వినమా? క్వాంటమ్ కంప్యూటర్ ఇచ్చిన కొత్త ఆశ!”
Quantum Computing: ప్రపంచానికి అంతులేని విద్యుత్‌ను అందించగల ఫ్యూజన్ ఎనర్జీకి ట్రిటియం అనే అరుదైన ఇంధనం పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించే దిశగా కీలక అడుగు పడింది. Oak Ridge National Laboratory, Cleveland Clinic, IBM శాస్త్రవేత్తలు కలిసి క్వాంటమ్ కంప్యూటర్‌పై తొలిసారి ట్రిటియం ఉత్పత్తికి ఉపయోగపడే కీలక పదార్థం యొక్క తొమ్మిది అణు నిర్మాణాలను గణించారు. ఈ పరిశోధన ఫ్యూజన్ విద్యుత్‌ను వాస్తవానికి మరింత దగ్గర చేసే మైలురాయిగా భావిస్తున్నారు.
ఫ్యూజన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
ప్రస్తుతం ప్రపంచంలోని అణు విద్యుత్ కేంద్రాలు యురేనియం అణువులను విడగొట్టే ఫిషన్ (Fission) ప్రక్రియతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫ్యూజన్ (Fusion) మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఇందులో రెండు తేలికపాటి హైడ్రోజన్ అణువులు అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద కలిసి ఒక పెద్ద అణువుగా మారతాయి. సూర్యుడిలో నిరంతరం జరిగేది కూడా ఇదే ప్రక్రియ.
ఈ సమయంలో విడుదలయ్యే అపారమైన శక్తిని నియంత్రించి విద్యుత్‌గా మార్చగలిగితే, చాలా తక్కువ ఇంధనంతోనే ఇప్పటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే, భూమిపై సూర్యుడిలో ఉండే పరిస్థితులను సృష్టించడం, అలాగే ఫ్యూజన్‌కు అవసరమైన ట్రిటియం వంటి ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి.








