ఆ రాత్రి సముద్రం అడుగున ఏం జరిగింది? భారత్ ఎందుకు అప్రమత్తమైంది?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
సముద్రం అబద్ధం చెప్పదు.
కానీ… నిజాన్ని కూడా ఎప్పుడూ చూపించదు.
పైకి చూస్తే…
అంతులేని నీరు.
నీలి ఆకాశం.
నెమ్మదిగా కదిలే అలలు.
ఈ ప్రశాంతతను చూసి… ఇక్కడ యుద్ధం గురించి ఆలోచించడం కూడా పిచ్చిగా అనిపిస్తుంది.
కానీ అదే సముద్రం…
కొన్ని వేల అడుగుల లోతులో మాత్రం మరో ప్రపంచం ఉంటుంది. అక్కడ సూర్యకాంతి చేరదు. అక్కడ జాతీయ జెండాలు ఎగరవు. అక్కడ సరిహద్దులు కనిపించవు. కానీ… అక్కడే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆటలు ఆడతారు.
ఆ రోజు కూడా…
సముద్రం తన రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు.
ఒక భారీ ఇనుప నీడ…
చీకటిలో నెమ్మదిగా ముందుకు కదులుతోంది.
దాన్ని వెంబడించే శబ్దం లేదు.
దాన్ని గమనించే కళ్లు లేవు.
అది అక్కడ ఉందని ప్రపంచానికి తెలియాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే…
దాని అసలు పని కనిపించడం కాదు.
అవసరం వచ్చినప్పుడు మాత్రమే…
ప్రపంచం తన వైపు తిరిగి చూసేలా చేయడం.
కొన్ని క్షణాలు గడిచాయి.
సముద్రం అలాగే ఉంది.
అలలు అలాగే ఉన్నాయి.
హఠాత్తుగా…
నీటి అడుగున చీకటి కదిలింది.
తర్వాత…
ఇవి కూడా చదవండి
సముద్రం గుండె చీలిపోయినట్టుగా ఒక తెల్లటి నీటి స్తంభం ఆకాశం వైపు విరుచుకుపడింది. దాని మధ్యలో… మంటలను భుజాన వేసుకున్న ఒక క్షిపణి చీకటిని చీల్చుకుంటూ పైకి దూసుకెళ్లింది. ఆకాశంలో అది కొన్ని సెకన్లే కనిపించింది. తర్వాత… అది మేఘాల్లో కలిసిపోయింది.
మళ్లీ… అన్నీ మామూలే. సముద్రం మళ్లీ ప్రశాంతమైంది. ఏమీ జరగనట్టే. కానీ… ప్రపంచం మాత్రం అప్పటికే ఎలర్ట్ అవ్వటం మొదలైంది.
టోక్యోలో ఒక గదిలో మ్యాప్‌లు తెరుచుకున్నాయి.
క్యాన్బెర్రాలో ఫోన్లు మోగాయి.
న్యూఢిల్లీలో సముద్ర మార్గాలను చూపించే డిజిటల్ స్క్రీన్ల ముందు కొందరు అధికారులు మరింత జాగ్రత్తగా నిలబడ్డారు.
ఒక్క క్షిపణి…
ఎవరినీ తాకలేదు.
ఒక్క పేలుడు…
ఏ నగరాన్నీ ధ్వంసం చేయలేదు.
అయినా…
ఆ రోజు ప్రపంచంలోని మూడు దేశాలు ఒక్కసారిగా ఒకే ప్రశ్న అడగడం మొదలుపెట్టాయి.
“ఇది కేవలం పరీక్షేనా… లేక ఒక హెచ్చరికా?”
ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే…
ముందు ఆ క్షిపణిని కాదు…
దాన్ని ప్రయోగించిన దేశాన్ని కాదు…
ఆ నిశ్శబ్ద సముద్రాన్ని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే…
ప్రపంచం చూసింది కేవలం ఒక క్షిపణిని కాదు. ఒక కొత్త సందేశాన్ని. ఇది సాధారణ క్షిపణి పరీక్ష కాదు… దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తాయి. క్షిపణులను తయారు చేస్తాయి. కానీ… అన్నింటికంటే ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే… అది సముద్రం అడుగున దాక్కునే అణు జలాంతర్గామి.
సాధారణంగా భూమిపై ఉన్న స్థావరాలు కనిపిస్తాయి. విమానాలు రాడార్లకి చిక్కుతాయి. కానీ… సముద్రం అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించే జలాంతర్గామిని గుర్తించడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి. అలాంటి జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని ప్రపంచ భద్రతా వ్యవస్థలు అత్యంత సీరియస్‌గా పరిగణిస్తాయి.
ఇటీవల చైనా పసిఫిక్ మహాసముద్రంలో నిర్వహించిన ఈ ప్రయోగం కూడా అందుకే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
చైనాకు చెందిన ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ’ సబ్‌మెరైన్ (జలంతర్గామి) నుండి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని (SLBM) పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోకి వెళ్లి పరీక్షించినప్పుడు, అది కేవలం ఇంజనీరింగ్ సామర్థ్యాలను సరిచూసుకోవడం అని ఎవరూ నమ్మటం లేదు.
విశ్లేషకుల ప్రకారం…2024లో భూమిపై నుండి ప్రయోగించే ICBM పరీక్షతో పాటు, ఇప్పుడు చేసిన ఈ ప్రయోగం ద్వారా బీజింగ్ తన అణు త్రివిధ దళాల (Nuclear Triad) సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చింది. క్షిపణి సముద్ర గర్భంలోకి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది కానీ, దాని వల్ల వచ్చిన రాజకీయ ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
చాలా మంది రక్షణ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం…
ఇది చైనా బహిరంగ పసిఫిక్ జలాల్లో నిర్వహించిన తొలి సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ (SLBM) పరీక్ష కావచ్చు. అయితే ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమే కాదు. చైనా అణు నిరోధక సామర్థ్యం మరింత పరిపక్వ దశలోకి వెళ్తోందని ప్రపంచానికి చూపించిన సంకేతంగా కూడా దీనిని చూస్తున్నారు.
ప్రపంచం ఎందుకు ఉలిక్కిపడింది?
ఈ పరీక్ష జరిగిన సమయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్ట్రేలియా, ఫిజీ కలిసి “ఓషన్ ఆఫ్ పీస్” భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది గంటల్లోనే ఈ క్షిపణి పరీక్ష జరిగింది. దీంతో… ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక… ప్రాంతీయ దేశాలకు పంపిన రాజకీయ సంకేతమా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
సమాధానం ఇంకా ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ… ఆ ప్రశ్న మాత్రం ఇప్పటికీ ప్రపంచ భద్రతా వర్గాల్లో వినిపిస్తూనే ఉంది.
మొదట స్పందించింది జపాన్.
జపాన్‌కు ఈ వార్త సాధారణంగా అనిపించలేదు. వెంటనే అధికారిక నిరసన తెలిపింది. ఎందుకంటే… చైనా జలాంతర్గాములు ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులతో సముద్రంలోకి వస్తే… జపాన్ చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాలే వాటి ప్రధాన మార్గాలుగా మారే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో… తైవాన్ చుట్టూ ఎప్పుడైనా ఉద్రిక్తత పెరిగితే… దాని ప్రభావం ముందుగా పడే దేశాల్లో జపాన్ ఒకటి.
ఆస్ట్రేలియా ఎందుకు ఆందోళన చెందుతోంది?
ఒకప్పుడు… దక్షిణ పసిఫిక్ ఆస్ట్రేలియాకు రక్షణ కవచంలా ఉండేది. ఇప్పుడు… అదే ప్రాంతం పోటీకి కేంద్రంగా మారుతోంది. అందుకే ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఈ పరీక్షపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కానీ అసలు విషయం ఇంకోటి. ఇప్పటికే ఆస్ట్రేలియా తన సైన్యాన్ని ఆధునీకరిస్తోంది. పసిఫిక్ దీవి దేశాలతో కొత్త భద్రతా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఎందుకంటే… సముద్ర మార్గాలను రక్షించడం ఇప్పుడు తన మనుగడలో భాగమని అది గ్రహించింది.
“మనకు దీనితో సంబంధం ఏమిటి?” అని అనుకుంటున్నారా?
ఇదే ఈ కథలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న. చాలామందికి చైనా అంటే… హిమాలయాలు. లద్దాఖ్. అరుణాచల్ ప్రదేశ్. అంతే. కానీ… రేపటి పోటీ,యుద్దం కేవలం భూమిపై మాత్రమే జరగకపోవచ్చు. సముద్రాల్లో కూడా జరుగుతుంది. పసిఫిక్‌లో మరింత ధైర్యంగా ప్రయాణించే చైనా అణు జలాంతర్గాములు… భవిష్యత్తులో హిందూ మహాసముద్రంలో కూడా తమ ఉనికిని పెంచే అవకాశం ఉందని భారత వ్యూహకర్తలు చాలాకాలంగా గమనిస్తున్నారు.
అందుకే భారత్…
అండమాన్-నికోబార్ దీవుల్లో తన సైనిక మౌలిక సదుపాయాలను బలపరుస్తోంది. తన అణు జలాంతర్గాముల సామర్థ్యాన్ని కూడా క్రమంగా పెంచుతోంది. మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి వచ్చే మార్గాలను గమనించే అత్యంత కీలక స్థానం అదే.
అసలు ఆందోళన: అమెరికా అండగా ఉంటుందా?
ప్రాంతీయ దేశాలను ఎక్కువగా కలవరపెడుతున్నది చైనా పెరుగుతున్న శక్తి మాత్రమే కాదు, అమెరికా ఎంతవరకు మద్దతుగా నిలుస్తుందనే సందేహం కూడా.
వాషింగ్టన్ తన ప్రాంతీయ కమాండ్‌ను “ఇండో-పసిఫిక్” అని పిలవడం మానేసి, మళ్ళీ పాత పేరు అయిన “పసిఫిక్ కమాండ్” అని పిలవడం ప్రారంభించినట్లు వస్తున్న వార్తలు మిత్రదేశాలలో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా తన పరిధిని తగ్గించుకుంటోందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి తోడు, కూటములతో కేవలం లాభనష్టాల బేరసారాల ధోరణి, ‘క్వాడ్’ (Quad) భాగస్వామ్యంలో మునుపటి కంటే సమన్వయం తగ్గడం వంటివి చూస్తుంటే భారత్, జపాన్, ఆస్ట్రేలియాలకు ఒక విషయం స్పష్టమవుతోంది: కాగితంపై భద్రతా హామీ ఉండటం వేరు, అవసరమైనప్పుడు అండగా నిలబడే రాజకీయ సంకల్పం ఉండటం వేరు.
అమెరికా నేతృత్వంలోని కూటమిలో ఉన్న బలహీనతలను పరీక్షించడానికే చైనా ఈ ప్రయోగాన్ని ఒక సాధనంగా వాడుకుందని ఒక రక్షణ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
మారుతున్నది కేవలం చైనా కాదు…
పసిఫిక్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, అమెరికా కూటమి బలహీనతను బయటపెట్టడానికి చైనా ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కానీ, ఇది చైనా ఊహించిన దానికి పూర్తి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తోంది. జపాన్ తన రక్షణ ఖర్చును పెంచుతోంది. దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. ఆస్ట్రేలియా ప్రాంతీయ భద్రతలో మరింత చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత్ తన సముద్ర రక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ప్రతి దేశం ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. తమ భద్రతను కాపాడుకోవడానికి… తమ బలం కూడా అవసరమే.
చివరగా…
ఆ రాత్రి…
పసిఫిక్ మహాసముద్రం నుంచి ఆకాశంలోకి ఎగిరింది ఒక క్షిపణి మాత్రమే కావచ్చు.
కానీ… ప్రపంచం చూసింది ఒక కొత్త యుగం నిశ్శబ్దంగా తెరచుకుంటున్న క్షణాన్ని.
చరిత్రలో కొన్ని యుద్ధాలు…
మొదటి బుల్లెట్ పేలిన రోజు మొదలవ్వవు.
మొదటి హెచ్చరికను ప్రపంచం అర్థం చేసుకున్న రోజే మొదలవుతాయి.
బహుశా…
అలాంటి రోజుల్లో ఒకటి…
ఆ రాత్రే అయి ఉండొచ్చు.
అందుకే…
ప్రపంచం ఈ పరీక్షను కేవలం “మిస్సైల్ టెస్ట్”గా చూడలేదు. మారిపోతున్న శక్తి సమీకరణాల నిశ్శబ్ద ప్రకటనగా చూసింది.








