సింగరేణి సిగలో తాడిచర్ల-2.. పార్టీల క్రెడిట్ ఫైట్!
తెలంగాణ ప్రజల, సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ నెరవేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన తాడిచర్ల బొగ్గు బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వేలం లేకుండానే నేరుగా ఈ మైన్‌ను కేటాయించడం సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే, ఈ కేటాయింపు ప్రకటన వెలువడిన క్షణం నుంచే తెలంగాణ రాజకీయాల్లో ‘క్రెడిట్ వార్’ ముదిరింది. “ఇది మా వల్లే సాధ్యమైంది” అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేటాయింపులు చేసిన బీజేపీ నేతలు పోటాపోటీగా క్లెయిమ్ చేసుకుంటున్నారు.
గోదావరి లోయ బొగ్గు గనుల పరిధిలోని ములుగు కోల్ బెల్ట్ వాయువ్య ప్రాంతంలో తాడిచర్ల బ్లాక్-2 విస్తరించి ఉంది. దాదాపు 1,875 హెక్టార్ల పరిధిలో విస్తరించిన ఈ బ్లాక్‌లో భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ బ్లాక్‌లో దాదాపు 182 మిలియన్ టన్నుల నుంచి 434 మిలియన్ టన్నుల వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇందులో లభించే బొగ్గు అత్యంత నాణ్యమైన జీ-8, జీ-9 గ్రేడ్‌కు చెందినది. ఇది ఎన్టీపీసీ, కేటీపీపీ వంటి భారీ విద్యుత్ కేంద్రాలకు ఎంతో అనుకూలం. ఈ గని ద్వారా ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల బొగ్గును 40-50 ఏళ్ల పాటు ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం, సుమారు 1,200 నుండి 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో తాడిచర్ల బ్లాక్-1ను టీజీ జెన్కోకు కేటాయించగా, బ్లాక్-2 కోసం కూడా జెన్కో ప్రయత్నించింది. కానీ, అంతిమంగా కేంద్రం దీన్ని సింగరేణికే దక్కేలా చేసింది.
ఈ కేటాయింపు ఫైలుపై ప్రధాని నరేంద్ర మోడీ అనుమతితో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంతకం చేశారు. 2020 నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు వేలం లేకుండా నేరుగా గనులు కేటాయించే పద్ధతి నిలిచిపోయినప్పటికీ, సింగరేణి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు బీజేపీ చెప్తోంది. వేలం పాట లేకపోవడం వల్ల సింగరేణికి సుమారు రూ.2,550 కోట్ల ఆక్షన్ ప్రీమియం మిగిలిందని, రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.16,000 కోట్లు వస్తాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో ఏ ముఖ్యమంత్రి లేఖలు రాసినా సాధ్యం కానిది తాము చేసి చూపించామని బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి.
మరోవైపు, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం జరిపిన పోరాటాలు, కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే ఇది సాధ్యమైందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీ స్థాయిలో గట్టి ఒత్తిడి తెచ్చారని, వేలంలో కాకుండా నేరుగా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి పంపిన ప్రతిపాదనల వల్లే కేంద్రం దిగివచ్చిందని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఇక ప్రధాన ప్రతిపాక్షం బీఆర్ఎస్ సైతం ఈ క్రెడిట్ రేసులో వెనక్కి తగ్గడం లేదు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిచర్ల బ్లాక్-2ను సింగరేణికి ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశామని, కేంద్రానికి వందలాది లేఖలు రాశామని గుర్తు చేస్తోంది. కార్మిక సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో తాము చేసిన ఆందోళనల ఫలితంగానే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. కాంగ్రెస్ కేవలం ఇప్పుడొచ్చి బిల్డప్ ఇస్తోందని గులాబీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
పొలిటికల్ క్రెడిట్ వార్ ఎలా ఉన్నప్పటికీ, వేలం ప్రక్రియ లేకుండా తాడిచర్ల-2 దక్కడం సింగరేణి ఆర్థిక పురోగతికి ఊపిరి పోసినట్లయింది. అయితే ఈ బ్లాక్‌లో ఎక్కువ భాగం అటవీ భూమి కావడంతో.. మైనింగ్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లు సాధించి పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.








