ఇండోనేషియాకు బ్రహ్మోస్.. 5,600కోట్ల డిఫెన్స్ డీల్..!
సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిస్సైల్స్ ను.. ఇండోనేషియాకు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ.. డిఫెన్స్ డీల్ పై సంతకాలు చేశారు. ఈడీల్ విలువ దాదాపు 5,600 కోట్లు. నౌకాయాన భద్రత, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, ఔషధాలు, విద్య, అంతరిక్షం, టెలికం, ఆహార భద్రత, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్, నికెల్, కొన్ని అరుదైన ఖనిజాలతో అయస్కాంతాల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ సంసిద్ధత తెలిపింది.
భారత ప్రధాని నరేంద్రమోడీ.. ఇండోనేసియా పార్లమెంటులో ప్రసంగించడం ద్వారా చరిత్ర సృష్టించారు. భారత్-ఇండోనేసియా మధ్య సంబంధాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, 140 కోట్ల మంది భారతీయులు.. 29 కోట్ల మంది ఇండోనేసియా వాసులు కలిసి సృష్టించే సుసంపన్నతను ప్రపంచం వీక్షిస్తుందని మోడీ చెప్పారు. ‘‘ఇరు దేశాల మధ్య వారధిలా సముద్రం నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, నలందా విజ్ఞాన సంపద మన బంధానికి పునాది’’ అని పార్లమెంటు ప్రసంగంలో తెలిపారు
అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చల అనంతరం రెండు దేశాల మధ్య 14 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కలిసి ఉత్పత్తి, నౌకల నిర్మాణంలో సహకరించుకోవడం, నిర్వహణ సదుపాయాలపై నేతలిద్దరూ చర్చించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ ఓడరేవును ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు అంగీకరించాయి. ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌ను ఇండోనేసియాలో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇండోనేసియాకు ఈవీఎంలను ఎగుమతి చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది.
మోడీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింతాంగ్ ఆదిపుర్ణా’ (స్టార్ ఆఫ్ ఇండోనేసియా)ను సుబియాంతో ప్రదానం చేశారు. ఇది భారతీయులకు దక్కిన గౌరవమని, దీనిని వారికే అంకితమిస్తున్నానని మోదీ చెప్పారు. జకార్తాలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోడీ మాట్లాడారు. రిఫార్మ్ (సంస్కరించు), పెర్ఫార్మ్ (పనితీరు చూపించు), ట్రాన్స్‌ఫార్మ్ (రూపాంతరీకరణ) అనేదే తమ మంత్రమని, దాని ఆధారంగానే భారత్ ముందుకు వెళ్తోందన్నారు. సుబియాంతో మాట్లాడుతూ తనలోనూ భారతదేశ డీఎన్ఏ ఉందని, భారతీయ సంగీతం వింటే తాను పులకిస్తానన్నారు. తాను భారతీయులందరికీ మిత్రుడినని, మోదీని ఆరాధిస్తానని, ఆయన విధానాలను కాపీ కొడుతున్నానని చెప్పారు. స్నేహితుల మధ్య ‘కాపీరైట్’ ఉండదని మోడీ నవ్వుతూ స్పందించారు.








