రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలనం..!
సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్(Prashna Ravan) అరెస్టు ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రావణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ వస్తున్న ప్రచారాన్ని కొడాలి నాని పూర్తిగా ఖండించారు.
“రావణ్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి. ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తుంటారు. అందుకే ఆయన ఎప్పుడూ టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. టీడీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్, ఎల్లో మీడియా మాత్రమే అసత్య కథనాలతో రావణ్‌ను వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నాయి” అని నాని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై రావణ్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ, తామెప్పుడూ ఆయనపై అణచివేత చర్యలకు పాల్పడలేదని కొడాలి నాని గుర్తు చేశారు.
“అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గానీ, మా పార్టీ నేతలు గానీ రావణ్ విమర్శలను భరించామే తప్ప.. ఆయనపై అక్రమ కేసులు పెట్టలేదు. జనసేన పార్టీలాగా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి దాడులకు ప్రయత్నించలేదు” అని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని రావణ్ మాట్లాడటమే ప్రస్తుత ఆయన అరెస్టుకు అసలు కారణమని కొడాలి నాని విశ్లేషించారు. జనసేన పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రావణ్‌పై వరుస కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పిందని ఆరోపించారు.
కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ ఇవ్వడంతో, తట్టుకోలేక ప్రభుత్వం కొత్త చట్టాలను అడ్డం పెట్టుకుని ఇడ్లీ, ఉప్మా అంటూ అక్రమంగా జైల్లో పెడుతోందని విమర్శించారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడికి రోజులు దగ్గరపడ్డాయని కొడాలి నాని హెచ్చరించారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. “తమకు నచ్చని వ్యక్తులను పోలీస్ స్టేషన్లలో పెట్టి తగలబెట్టించే సంస్కృతి టీడీపీది. అందుకే ప్రజలు ఇప్పుడు టీడీపీని గొడ్డలి పార్టీ కాదు.. ‘బూడిద పార్టీ’ అని పిలుచుకుంటున్నారు” అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిని అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.








