గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ టాప్.. ఎంబప్పే, హాలాండ్లకు చెక్..!
అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026) పతాక స్థాయికి చేరుకుంది. రౌండ్ ఆఫ్ 16 (RO16) మ్యాచ్‌లు ముగిసి క్వార్టర్ ఫైనల్స్ సమీపిస్తున్న వేళ, టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బూట్’ (Golden Boot) రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) అద్భుత ఫామ్‌తో దూసుకుపోతూ ప్రస్తుతం ఈ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు.
రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఒక దశలో 2-0 తేడాతో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే, ఆట 79వ నిమిషంలో అర్జెంటీనా మొదటి గోల్ చేయగా, ఆ తర్వాత సరిగ్గా నాలుగు నిమిషాలకే (83వ నిమిషంలో) మెస్సీ సంచలన గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకి ఇది 8వ గోల్ కావడం విశేషం. అనంతరం ఎక్స్ట్రా టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ చేసిన విన్నింగ్ గోల్‌తో అర్జెంటీనా 3-2తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఈజిప్ట్‌పై చేసిన ఈ 8వ గోల్‌తో మెస్సీ ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబప్పే, నార్వే స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్లను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఎంబప్పే, హాలాండ్ ఇద్దరూ తలా 7 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ 6 గోల్స్‌తో రేసులో గట్టి పోటీని ఇస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లలో ఎవరైనా ఒక్క మ్యాచ్‌లో చెలరేగితే ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) – 8 గోల్స్ తో టాప్ లో ఉండగా, కిలియన్ ఎంబప్పే (ఫ్రాన్స్) – 7 గోల్స్, ఎర్లింగ్ హాలాండ్ (నార్వే) – 7 గోల్స్, హ్యారీ కేన్ (ఇంగ్లాండ్) – 6 గోల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.








