మళ్లీ రాజుకున్న అమెరికా-ఇరాన్ వివాదం.. పెట్రోల్, బంగారం ధరలు పరుగెత్తనున్నాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతోంది. కానీ దాని ప్రభావం మన జేబుపైనా పడే పరిస్థితి వస్తుందా? అమెరికా ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయడంతో పాటు చమురుపై కొత్త ఆంక్షలు విధించడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళన రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు (Bond Yields) 5 శాతం దాటగా.. ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి ఒకటే… ఈ ఉద్రిక్తత భారత్‌పై ఎంత ప్రభావం చూపబోతోంది? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరగొచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు, విమాన టికెట్లు, రవాణా ఖర్చులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ప్రపంచంలో యుద్ధ భయాలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, రూపాయి మారక విలువపై ఒత్తిడి కూడా కనిపించవచ్చు.
ఈ సంక్షోభం వల్ల ఏం మారొచ్చు?
పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి
బంగారం ధరలు పెరిగే అవకాశం
స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు
రూపాయి విలువపై ప్రభావం
విమానయాన, షిప్పింగ్ ఖర్చులు పెరిగే అవకాశం
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత ఎక్కడివరకూ వెళ్తుంది? ప్రపంచ చమురు మార్కెట్ ఎలా స్పందిస్తుంది? ఈ రెండు ప్రశ్నలకే ఇప్పుడు ప్రపంచంతో పాటు భారత మార్కెట్లు కూడా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.








