అమెరికా డాలర్‌కు ప్రపంచం చెక్ పెడుతోందా? నిశ్శబ్ద ఆర్థిక విప్లవం వెనుక అసలు కథ ఇదే!
—శివ దువ్వూరు
ప్రపంచంలో డబ్బుకు ఒకే పేరు ఉంటే… అది డాలర్ అవుతుంది.
ఒక దేశం మరో దేశం నుంచి చమురు కొనాలన్నా…
బంగారం అమ్మాలన్నా…
విమానాలు కొనుగోలు చేయాలన్నా…
విదేశాలకు రుణం ఇవ్వాలన్నా…
ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఆర్థిక ఒప్పందం జరిగినా… చివరికి ఒక పేరు మాత్రం తప్పకుండా వినిపిస్తుంది.
అదే డాలర్.
అది కేవలం అమెరికా కరెన్సీ కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాట్లాడే భాష. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా… ప్రపంచం అదే భాషలో మాట్లాడుతోంది. అందుకే… డాలర్ విలువ పడిపోయిందంటే ప్రపంచ మార్కెట్లు వణుకుతాయి. అంతెందుకు పెట్రోల్‌కు మనం రూపాయల్లో డబ్బు చెల్లిస్తాం. కానీ భారత్ విదేశాల నుంచి చమురు కొనేటప్పుడు ఎక్కువగా డాలర్లలోనే చెల్లించాలి. అందుకే డాలర్ బలపడినా… బలహీనపడినా… దాని ప్రభావం చివరికి మన పెట్రోల్ బిల్లుపై కూడా కనిపించొచ్చు.
అమెరికా వడ్డీ రేట్లు పెంచితే…హైదరాబాద్‌లో హోమ్ లోన్ EMI నుంచి… మన రూపాయి విలువ వరకు ప్రభావం కనిపిస్తుంది. అంత బలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేర్లు వేసుకుని పాతుకుపోయింది డాలర్.
అందుకే…”డాలర్ లేకుండా ప్రపంచ వాణిజ్యం నడవదు” అనేది ఇన్నేళ్లుగా ఎవరూ ప్రశ్నించని నిజంగా స్దిరపడిపోయింది.
ఇవి కూడా చదవండి
కానీ…
చరిత్రలో కొన్ని నిజాలు ఒక్కసారిగా కూలిపోవు. ముందు వాటిపై సందేహాలు మొదలవుతాయి. ఇప్పుడు…
అదే సందేహం డాలర్‌పై మొదలైంది.
“ప్రపంచం నిజంగానే డాలర్‌పైనే ఆధారపడి ఉండాలా?”
ఈ ఒక్క ప్రశ్న… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 80 ఏళ్లుగా మారని సమీకరణాలను కదిలించడం ప్రారంభించింది. ఒక యుద్ధం… ప్రపంచానికి కొత్త పాఠం చెప్పింది 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచం యుద్ధాన్ని మాత్రమే చూడలేదు. డబ్బు కూడా ఒక ఆయుధం అవుతుందని అర్దం చేసుకుంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి.
అప్పుడే రష్యా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన సుమారు 300 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు స్తంభించిపోయాయి.అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని కొన్ని కీలక సేవలకు రష్యా దూరమైంది.
ఈ సంఘటన చూసిన…చాలా దేశాలు ఒకే ప్రశ్న వేసుకున్నాయి. “డబ్బు కూడా రాజకీయ ఆయుధంగా మారితే… మన పరిస్థితి ఏంటి?”
అసలు భయం డాలర్ కాదు…డాలర్ మీద ప్రపంచం ఆధారపడటం. ఇన్నేళ్లుగా ప్రపంచం ఒకే రహదారిపై ప్రయాణించింది. ఆ రహదారి పేరు… డాలర్.
ఆ రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించే శక్తి అమెరికాకు వచ్చింది. అందుకే… అమెరికా ఒక్క సంతకంతో ఒక దేశం బ్యాంకింగ్ వ్యవస్థనే నిలిపివేయగలదు. అదే అధికారాన్ని… ఇప్పుడు ప్రపంచం మెల్లగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆ దేశాల కూటమినే మనం ఇప్పుడు BRICS అని పిలుస్తున్నాం.
కానీ…ఈ కథ BRICS గురించి కాదు… డాలర్ ఏకాధిపత్యానికి మొదలైన నిశ్శబ్ద విప్లవం గురించి.
BRICS అసలు చేస్తున్న పని ఏంటి?
చాలామంది అనుకుంటున్నట్లు…BRICS రేపు కొత్త కరెన్సీ తీసుకురావడం లేదు. అది ఈ కథలోని అతిపెద్ద అపోహ. ఎందుకంటే…భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, ఇతర సభ్య దేశాల ఆర్థిక విధానాలు పూర్తిగా వేర్వేరు. అలాంటి పరిస్థితిలో ఒకే కరెన్సీ తీసుకురావడం చాలా క్లిష్టమైన పని. అందుకే వాళ్లు మరో దారిని ఎంచుకున్నారు.
కొత్త కరెన్సీ కాదు… కొత్త చెల్లింపు వ్యవస్థ.
ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో ఇప్పటికీ సుమారు 58 శాతం అమెరికా డాలర్లే ఉన్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల్లో కూడా డాలర్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
ఈ మార్పులో భారత్ పాత్ర ఏంటి?
రష్యా ఘటన తర్వాత ప్రపంచం ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టిందని చెప్పుకున్నాం కదా. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఉదాహరణకు… భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చమురు కొనుగోలు చేస్తే…లేదా బ్రెజిల్ నుంచి సోయాబీన్ దిగుమతి చేసుకుంటే… ప్రతి సారి అమెరికా డాలర్‌లోనే లావాదేవీ జరగాల్సిన అవసరం లేకుండా… రూపాయిలో లేదా భాగస్వామ్య దేశాల కరెన్సీల్లోనే చెల్లింపులు జరిపే మార్గాలను పరిశీలిస్తోంది.
ఈమేరకు ఇప్పటికే భారత్ కొన్ని దేశాలతో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే చర్యలు ప్రారంభించింది. BRICS సభ్య దేశాలు కూడా స్థానిక కరెన్సీల్లో వాణిజ్య సెటిల్మెంట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
చైనా తన కరెన్సీ అయిన ‘రెన్మిన్బి’ (యువాన్) అంతర్జాతీయ వాడకాన్ని ప్రోత్సహిస్తుండగా… భారతదేశం, బ్రెజిల్, రష్యా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాలు తమ సొంత కరెన్సీలలోనే వ్యాపార లావాదేవీలను సెటిల్ చేసుకోవడాన్ని పెంచుతున్నాయి. ఇక్కడ లక్ష్యం డాలర్‌ను పూర్తిగా లేకుండా చేయడం కాదు, దానిపై ఉన్న అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మాత్రమే.
ఇది డాలర్‌కు యుద్ధం ప్రకటించడం కాదు.
డాలర్‌కు ప్రత్యామ్నాయాలు పెంచడం. మరి డాలర్ రోజులు ముగిసిపోయాయా? అంటే లేదు అనే చెప్పాలి.
ఇక్కడే సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డాలర్ బలం కేవలం అమెరికా వల్ల రాలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్లు… బలమైన న్యాయ వ్యవస్థ…పెట్టుబడిదారుల విశ్వాసం… ఇవన్నీ ఇప్పటికీ డాలర్‌కు అండగా ఉన్నాయి.
దీనికి తోడు ప్రపంచ విదేశీ మారక లావాదేవీల్లో ఇప్పటికీ దాదాపు 88 శాతం ట్రేడ్లలో డాలర్ ఒక వైపు కరెన్సీగా ఉంటుంది. అందుకే… డాలర్‌ను రేపే మరో కరెన్సీ భర్తీ చేస్తుందని చెప్పడం వాస్తవానికి దూరమే అవుతుంది.
కానీ…ఇక్కడే అసలు మార్పు దాగి ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి ఒకే తలుపు ఉండేది. ఇప్పుడు… రెండో తలుపు నిర్మాణంలో ఉంది. ఆ తలుపు పేరు BRICS కాదు. ఎంపిక. దేశాలకు…
“డాలర్ మాత్రమే కాదు… ఇంకో దారి కూడా ఉంది” అనే ఎంపిక.
ఏదైమైనా..
డాలర్ రేపే అదృశ్యమవదు. అమెరికా ఆధిపత్యం ఒక్కరోజులో ముగియదు. కానీ… ప్రపంచం ఇకపై ఒకే కరెన్సీపై పూర్తిగా ఆధారపడాలా అనే ప్రశ్న మాత్రం మొదటిసారి బలంగా వినిపిస్తోంది. అదే అసలు మార్పు.
ఇది ఒక కొత్త కరెన్సీ పుట్టుక కాదు. ఒక కొత్త ఆలోచన పుట్టుక.
డాలర్‌కు గుడ్‌బై చెప్పే ప్రపంచం మొదలైందా?
దీనికి సమాధానం చెప్పడానికి ఇంకా సమయం ఉంది.
కానీ… డాలర్ ఒక్కటే దారి అనే ప్రపంచం మాత్రం నెమ్మదిగా మారడం ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి








