కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
భారత తూర్పుతీరంలో మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అత్యంత అనుకూలం
దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టండి
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు ముందుకు రండి
బుసాన్ (సౌత్ కొరియా): భారత తూర్పుతీరంలో మారిటైమ్ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతం. 1053 కి.మీ.ల సుదూర తీరప్రాంతం కలిగి ఉంది. ఒక మేజర్, 5 నాన్ మేజర్ ఆపరేషనల్ పోర్టుల ద్వారా ప్రతిఏటా 330 మిలియన్ టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (KOMEA) ఆధ్వర్యాన బుసాన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో మరో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. 1.10 లక్షల ఎకరాలకు పైగా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఏపీలో అందుబాటులో ఉంది. ప్రతి 50 కి.మీ.లకు ఒక ఓడరేవు/షిప్ యార్డ్/ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
భారత్ లో మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నంలో రూ.30వేల కోట్లతో 3,488 ఎకరాల్లో నిర్మితమవుతోంది. దీనిని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్ శ్రీసిటీ, కృష్ణపట్నం పోర్టులకు సమీపంలో ఉండటంతోపాటు కనెక్టివిటీ కలిగి ఉంది. భారతీయ ఎగుమతి మార్కెట్ల కోసం కొరియన్ పరికరాలను స్థానికీకరించడానికి, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, ఉమ్మడి సౌకర్యాల ఏర్పాటుకు కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (KOMEA) ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాం. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ లో టెస్టింగ్/సర్టిఫికేషన్ ల్యాబ్ లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్‌ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్కును ఏర్పాటు చేయాల్సిందిగా KOMEA సభ్యులను స్వాగతిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.
భారతదేశంలో సుమారు US$12.3 బిలియన్ల నౌకా నిర్మాణ ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పటికీ 93% అంతర్జాతీయ సరుకు రవాణా విదేశీ నౌకల ద్వారానే జరుగుతోంది. తీరప్రాంత నౌకలలో 50% 20 ఏళ్లకు పైబడినవి, MoPNG పరిధిలోని 112 నౌకలు, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నౌకల మరమ్మతులకు డిమాండ్ ఉంది. భారత ప్రభుత్వం రూ.70వేల కోట్ల మారిటైమ్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క నౌకా నిర్మాణానికి 15నుంచి 25 శాతం ఆర్థిక సాయం అందుతోంది. రూ.25వేల కోట్ల మారిటైమ్ డెవలప్ మెంట్ ఫండ్ ద్వారా కొత్త యార్డులకు మూలధన వ్యయంలో 25శాతం వరకు గ్రాంట్ల రూపంలో అందుతోంది. నౌకా నిర్మాణానికి మౌలిక సదుపాయాల హోదా లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను చేతల్లో అమలు చేసి చూపిస్తున్నాం. కియా (US$2 బిలియన్లు, సుమారు 24 నెలల్లో ట్రయల్ ప్రొడక్షన్), ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (శ్రీసిటీ, ఒక సంవత్సరంలోపే శంకుస్థాపన), AM/NS (US$15.3 బిలియన్లు, 17 నెలల్లో శంకుస్థాపన) ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనం. కొరియన్ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో పనిచేస్తున్నాయి, చెన్నై రీజియన్ లో మరో 50 కంపెనీల వరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, ఆర్ & డీ సంస్థల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB)తో భాగస్వామ్యం వహించాల్సిందిగా కొరియా మెరైన్ ఎక్విప్ మెంట్ అసోసియేషన్ (KOMEA) ప్రతినిధులకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాన్లా ఐఎంస్, హ్యుందయ్ వెల్డింగ్, డేసన్ షిప్ యార్డు, సన్ బో ఇండస్ట్రీస్, ఓరియంటల్ ప్రెసిషన్ & ఇంజనీరింగ్, ఫైన్ కొరియా, జేవో ఇంజనీరింగ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.








