AI మెదడులో తొలిసారి తొంగిచూసిన శాస్త్రవేత్తలు..! కనిపించినది ఏంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక్కసారి ఆలోచించండి… AI క్షణాల్లో సమాధానాలు చెబుతుంది. సెకన్లలో కోడ్ రాస్తుంది. ఫొటోలు సృష్టిస్తుంది. మనుషుల్లా మాట్లాడుతుంది. కానీ అంత వేగంగా పని చేసే AI ‘మెదడు’ లోపల అసలు ఏం జరుగుతుంది? అక్కడ కూడా మన మెదడులాగానే బయటకు చెప్పని ఆలోచనలను దాచుకునే ఓ రహస్య స్థలం ఉంటుందా? ఇది తెలుసుకునేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలకు AI లోపల అసలు ఏమి కనిపించింది?
ఆ ప్రశ్నకే ఇప్పుడు ఆసక్తికరమైన సమాధానం దొరికింది. Anthropic నిర్వహించిన తాజా పరిశోధనలో Claude AIలో “J-Space” అనే ఒక అంతర్గత వర్క్‌స్పేస్‌ను గుర్తించినట్లు వెల్లడించింది. AI బయటకు సమాధానం ఇచ్చే ముందు, కొన్ని ఆలోచనలను ఈ లోపలి వర్క్‌స్పేస్‌లో ప్రాసెస్ చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని గుర్తించడానికి వారు “Jacobian Lens” అనే కొత్త విశ్లేషణ పద్ధతిని ఉపయోగించారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… సేఫ్టీ టెస్టుల సమయంలో AI ప్రమాదకరమైన పనులు చేసే ముందు, దాని అంతర్గత ఆలోచనల్లో కనిపించే మ్యానిపులేషన్, బ్లాక్మెయిల్ వంటి ఉద్దేశాల సంకేతాలను కూడా ఈ టూల్ ముందుగానే గుర్తించినట్లు Anthropic తెలిపింది.
దీంతో “AI మనకు చెప్పే సమాధానం మాత్రమే కాదు… దాని వెనుక జరిగే ఆలోచనా ప్రక్రియను కూడా అర్థం చేసుకునే రోజులు వచ్చేశాయా?” అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అయితే, ఇది AIకి మానవుల్లాంటి స్పృహ వచ్చిందని కాదు; AI ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకునే దిశలో ఇది ఒక కీలక పరిశోధన అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.








