షారుఖ్ చాలు కదా… మరి ₹450 కోట్లు ఎందుకు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు షారుఖ్ ఖాన్ పేరు చాలు… టికెట్లు అమ్ముడయ్యేవి.
ఇప్పుడు అదే షారుఖ్ సినిమాను అమ్మడానికి ₹450 కోట్ల స్కేల్ కూడా అవసరమైందా?
‘కింగ్’ బడ్జెట్ బయటకు వచ్చిన తర్వాత బాలీవుడ్లో వినిపిస్తున్న అసలు ప్రశ్న ఇదే.
స్టార్డమ్ తగ్గిపోయిందని ఎవరూ చెప్పడం లేదు. కానీ స్టార్డమ్ ఒక్కటే సరిపోవడం లేదనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. అందుకే ‘కింగ్’ కేవలం షారుఖ్ కొత్త సినిమా కాదు… ప్రేక్షకుడి అంచనాలు ఏ స్దాయిలో మారిపోయాయో పరీక్షించే సినిమా కూడా.
ఒకప్పుడు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లే ముందు ఒకటే ప్రశ్న అడిగేవాడు.
“హీరో ఎవరు?”
ఇప్పుడు అదే ప్రేక్షకుడు మరో ప్రశ్న అడుగుతున్నాడు.
“ఈ సినిమా నేను ఇంట్లో చూడలేనిది ఏమి చూపిస్తోంది?”
ఇవి కూడా చదవండి
బహుశా… ఈ ఒక్క ప్రశ్నే ‘కింగ్’ వెనుక ఉన్న ₹450 కోట్ల ఆలోచనను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది.
షారుఖ్‌కు కాదు… ప్రేక్షకుడు కోసమే ఈ సినిమా తీస్తున్నారా?
షారుఖ్ ఖాన్ మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘పఠాన్’… ‘జవాన్’ లాంటి సినిమాలు ఆయనకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్డమ్ ఉందని నిరూపించాయి. అయితే ప్రశ్న స్టార్ గురించి కాదు. ఆ స్టార్‌ను చూడటానికి వచ్చే ప్రేక్షకుడి అంచనాల గురించి. ఇప్పుడు ప్రేక్షకుడు టికెట్ కొనడం లేదు…ఒక ఎక్సపీరియన్స్( అనుభవాన్ని) కొనుగోలు చేస్తున్నాడు.
ఇది బడ్జెట్ కాదు… ఒక బిజినెస్ మోడల్
ట్రేడ్ సర్కిల్స్‌లో తరచూ వినిపించే ఒక మాట ఉంది. “ఈ రోజుల్లో పెద్ద స్టార్ సినిమా, మొదటి రోజు కలెక్షన్లతో కాదు… ప్రపంచవ్యాప్తంగా ఎంతకాలం ఈవెంట్‌గా నిలుస్తుందనే దానితో గెలుస్తుంది.” అందుకే భారీ బడ్జెట్లో ఎక్కువ భాగం కథను మార్చడానికి కాదు… కథను ప్రపంచ స్థాయిలో చూపించడానికి వెళ్తోంది.
భారీ యాక్షన్.
ప్రీమియం విజువల్స్.
అంతర్జాతీయ లొకేషన్లు.
IMAX ప్రెజెంటేషన్.
ప్రపంచ మార్కెట్‌కు సరిపోయే ప్రొడక్షన్ విలువలు.
ఇవన్నీ ఇప్పుడు ఖర్చు కాదు… మార్కెటింగ్ టూల్స్‌గా మారుతున్నాయి.
‘పఠాన్’… ‘జవాన్’ షారుఖ్‌కు విజయం మాత్రమే ఇవ్వలేదు… ఒక కొత్త ఒత్తిడిని కూడా ఇచ్చాయా?
వరుస బ్లాక్బస్టర్ల తర్వాత సాధారణంగా హీరో సేఫ్ జోన్లోకి వెళ్తాడు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రతి కొత్త సినిమా… గత సినిమా కంటే పెద్దదిగా ఉండాలనే అంచనా. ప్రతి యాక్షన్ సీన్…గత సినిమాను మించాలనే ఒత్తిడి. ప్రతి విజువల్…సోషల్ మీడియాలో వైరల్ కావాలనే లక్ష్యం. ఇది కేవలం అభిమానుల అంచనా కాదు. మార్కెట్ చెప్పే మాటలు. ట్రేడ్‌లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న లెక్క ఇదే
సినిమా బిజినెస్‌ను పరిశీలించే విశ్లేషకులు తరచుగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. “బడ్జెట్ పెరిగిందంటే రిస్క్ మాత్రమే పెరగదు… ప్రపంచ మార్కెట్లో సినిమా అమ్ముకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.” అంటే… భారీ సినిమా అంటే భారీ రిస్క్ మాత్రమే కాదు. భారీ రికవరీ అవకాశాలు కూడా.
విదేశీ మార్కెట్లు.
ప్రీమియం స్క్రీన్లు.
అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్.
శాటిలైట్.
OTT.
ఇవన్నీ కలిపి ఇప్పుడు పెద్ద సినిమాల లెక్క మారిపోయింది. అయితే రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంది. ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది.
₹450 కోట్ల స్థాయి సినిమా…”హిట్” అయితే సరిపోదు. “ఈవెంట్” కావాలి. ప్రేక్షకుడు బయటకు వచ్చాక… “సినిమా బాగుంది” అనడం కాదు. “ఇది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా” అనాలి. అప్పుడు మాత్రమే ఈ లెక్కలు పని చేస్తాయి.
షారుఖ్‌కు మరో ఆప్షన్ ఉండేదా?
ఖచ్చితంగా ఉండేది. తక్కువ బడ్జెట్లో, స్టార్ పవర్‌పై ఆధారపడి కూడా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న వ్యూహం వేరు. స్టార్‌ను అమ్మడం కాదు… స్టార్ చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించి అమ్మడం. ఇదే ‘కింగ్’ ఆలోచన అయితే…ఇది షారుఖ్ కెరీర్లోనే కాదు, బాలీవుడ్ బిజినెస్ మోడల్లో కూడా ఒక కీలక మలుపు కావచ్చు.
చివరికి…
‘కింగ్’ హిట్ అయితే…
“భారీ బడ్జెట్ సరైన నిర్ణయం” అంటారు.
ఒకవేళ ఆశించిన స్థాయిలో ఆడకపోతే…
చర్చ కథ గురించి కాదు.
దర్శకుడు గురించి కాదు.
“షారుఖ్ లాంటి స్టార్‌కూ ఇప్పుడు వందల కోట్ల స్కేల్ అవసరమా?” అనే ప్రశ్న గురించే ఉంటుంది.
కాబట్టి…
‘కింగ్’ బాక్సాఫీస్ ఫలితం ఒక సినిమా విజయాన్ని మాత్రమే నిర్ణయించదు. స్టార్డమ్ ఇప్పటికీ టికెట్లు అమ్ముతుందా… లేక ఇప్పుడు ప్రేక్షకుడు స్టార్‌తో పాటు ఒక భారీ అనుభవాన్నే కొనుగోలు చేస్తున్నాడా? అనే ప్రశ్నకూ సమాధానం చెప్పే అవకాశం ఉంది.








