అనంతపురంలో పొలిటికల్ హైటెన్షన్..!
అనంతపురం జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు(MS Raju), రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య నడుస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తనపై తోపుదుర్తి చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఎమ్మెల్యే రాజు విధించిన డెడ్‌లైన్ ఈరోజుతో ముగుస్తుండటంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు ఇరునేతల కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చిన గడువు ఈరోజుతో ముగుస్తుందని గుర్తు చేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన అవినీతి, ఇతర ఆరోపణలను తోపుదుర్తి ఆధారాలతో సహా నిరూపించాలని, లేనిపక్షంలో తానే స్వయంగా తోపుదుర్తి ఇంటికి వెళ్లి కొడతానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీంతో టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. ఎమ్మెల్యే రాజు వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు, ఎమ్మెల్యే రాజు సవాళ్ల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఈరోజు వైసీపీ కీలక నేతల అత్యవసర సమావేశం జరగబోతోంది.
రాప్తాడు మరియు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, క్యాడర్ ఈ భేటీకి హాజరుకానున్నారు. ఎమ్మెల్యే రాజు హెచ్చరికలను ఎలా తిప్పికొట్టాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై తోపుదుర్తి తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇరుపక్షాల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు పీక్స్‌కు చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తోపుదుర్తి నివాసంతో పాటు జిల్లాలోని కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ముందస్తు నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తూ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.








