సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్..!
సస్పెండైన సీఐ నాగరాజును(CI Nagaraju) విచారించే విషయంలో ‘సిట్’ (SIT) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాలు విధించిన కఠినమైన షరతులతో కూడిన కస్టడీని తీసుకునేందుకు సిట్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. నిందితుడిని పూర్తి స్థాయిలో, ఎలాంటి పరిమితులు లేకుండా విచారించాలనే పట్టుదలతో ఉన్న అధికారులు.. షరతుల వల్ల విచారణ సరిగ్గా సాగదనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. దీంతో నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్ పడినట్లయింది. గతంలో విజయవాడ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిట్ అధికారులు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కస్టడీ విచారణపై ఉన్న షరతులను తొలగించాలని లేదా సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చిన తర్వాతే.. సదరు సస్పెండైన సీఐ నాగరాజును సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి, సీఐ నాగరాజును నేటి నుంచి 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కస్టడీకి కొన్ని ప్రత్యేక నిబంధనలు, షరతులు విధించడంతో.. సిట్ అధికారులు ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ఉన్నత కోర్టుల మధ్య నడుస్తున్న ఈ లీగల్ పోరాటం కారణంగా.. ఈ హైప్రొఫైల్ కేసులో విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ (25) అనే యువకుడిని గత మే నెలలో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్రమంగా నిర్బంధించి, లాకప్‌లో విపరీతంగా థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు జూలై 2న నాగరాజుకు 8 రోజుల కస్టడీ ఇచ్చింది. కానీ, విచారణను కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల మాత్రమే జరపాలని, అది కూడా సీసీటీవీ కెమెరాల నిఘాలో, నాగరాజు తరపు న్యాయవాదుల సమక్షంలోనే ప్రశ్నించాలని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.








