తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు..!
మడకశిర(Madakasira) టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సవాల్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. ఈ క్రమంలోనే రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudhurthi Prakash Reddy) నివాసంలో పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తోపుదుర్తి నివాసంలో భారీగా మారణాయుధాలు దాచి ఉంచారనే పక్కా సమాచారంతోనే రక్షణ విభాగాలు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ ముందస్తు చర్యలకు దిగారు.
ఈ సోదాల్లో పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగుచూశాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో భారీగా రాళ్లు, ఖాళీ బీరు బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే రాజు హెచ్చరికల నేపథ్యంలో, ఒకవేళ టీడీపీ నేతలు లేదా కార్యకర్తలు తమ ఇంటి వైపు వస్తే.. వారిపై ఈ రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి చేయడానికి వైసీపీ శ్రేణులు ముందుగానే ఒక పక్కా స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే వీటిని అక్కడ నిల్వ ఉంచారనే అనుమానంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
మరోవైపు ఈ తనిఖీల సమక్షంలో తోపుదుర్తి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఇంట్లో సోదాలు చేయడంపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తండ్రి తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో ఆయన నేరుగా వాగ్వాదానికి దిగారు. ముందస్తు అనుమతులు లేకుండా, కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది.
ఇంట్లో రాళ్లు, బాటిళ్లు దొరకడం.. మరోవైపు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుండటంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రాప్తాడు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.








