చైనా AIకి అమెరికా షాక్..! DeepSeekను చూసి భయపడుతోందా?
ఒకప్పుడు TikTok… ఇప్పుడు AI..! ప్రపంచ టెక్నాలజీ రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పుడు చైనాకు చెందిన DeepSeek వంటి AI మోడళ్లను అమెరికా కంపెనీలు తమ వ్యాపారాల్లో ఉపయోగించకుండా ఆంక్షలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
DeepSeek వంటి చైనా AI మోడళ్లు తక్కువ ఖర్చుతో అధిక పనితీరును అందిస్తుండటంతో అమెరికాలోని పలు కంపెనీలు వాటిని వేగంగా వినియోగిస్తున్నాయి. అయితే, ఈ AI మోడళ్ల ద్వారా సున్నితమైన వ్యాపార సమాచారం లేదా కీలక డేటా చైనా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్న జాతీయ భద్రతా ఆందోళనలు అమెరికా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో Airbnb, Anysphere (Cursor తయారీ సంస్థ) వంటి కంపెనీలు చైనా AI మోడళ్లను ఉపయోగిస్తున్నాయా అనే అంశంపై అమెరికా హౌస్ కమిటీలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. ఇప్పుడు వాటి వినియోగంపై మరింత కఠినమైన నియంత్రణలు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, అది కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా మాత్రమే ఉండదు. ప్రపంచ AI మార్కెట్, టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, AI సేవల భవిష్యత్తుపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకప్పుడు చిప్స్ కోసం జరిగిన పోటీ… ఇప్పుడు AI కోసం ప్రపంచ శక్తులు తలపడుతున్నాయనే అభిప్రాయం టెక్ వర్గాల్లో వినిపిస్తోంది.








