బీఆర్ఎస్పై కవిత సరికొత్త, సంచలన ఆరోపణలు.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగింది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, దాని అనుబంధ సోషల్ మీడియా వైఖరిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గులాబీ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1400 కోట్ల భారీ నిధుల వెనుక క్విడ్ ప్రొ కో అవినీతి దాగి ఉందంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సొమ్మును తక్షణమే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ వ్యక్తిగత విమర్శలకు పోలేదని స్పష్టం చేస్తూనే, బీఆర్ఎస్ విధానాలపై విమర్శల పర్వాన్ని ఎక్కుపెట్టారు.
తాను మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుకుంటానంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని కవిత పూర్తిగా ఖండించారు. “నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లే ప్రసక్తే లేదు” అని ఆమె తేల్చి చెప్పారు. ఒక మహిళ ఒంటరిగా ప్రజాబలంతో ముందుకు సాగుతుంటే ఓర్వలేక, కాంగ్రెస్, బీజేపీలతో చేతులు కలిపి తన ప్రజా పోరాటాలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చివరికి టీఆర్ఎస్ అనే పేరు కూడా తనకు దక్కకుండా చేసేందుకు ఏకంగా ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు పంపడం బీఆర్ఎస్ భయాందోళనలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ కవిత ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ లాంటి హరీశ్‌రావును బీఆర్ఎస్ ఇంకా ముందు పెట్టడం చూస్తుంటే, ఆ పార్టీ భవిష్యత్తు శూన్యమని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రొ కో పద్ధతిలో అక్రమ పర్మిషన్లు ఇచ్చారని, ఇటీవల రూ. 188 కోట్లు వెచ్చించి ‘పయనీర్’ అనే ఇంగ్లీష్ పేపర్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. డబ్బు బలంతో మీడియా, సోషల్ మీడియాలను గుప్పిట్లో పెట్టుకుని, తమ వార్తలు బయటకు రాకుండా గుంటనక్కల్లా ఫోన్లు చేయిస్తూ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోడెద్దుల్లా పార్టీని నడపాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు తల్లి, చెల్లె అనే కనీస సభ్యత మరచి ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. “సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు, కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా” అంటూ ఘాటుగా హెచ్చరించారు. మరోవైపు ఫినిక్స్ సంస్థకు రూ. 80 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని, అటవీ శాఖ పెట్టిన కేసులను కూడా పక్కనబెట్టేశారని ఆరోపించారు. అవినీతి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తలుపులు తెరిచిందని విమర్శించారు. కేవలం సీఎంపై కోపంతోనే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం లేదని, చిన్న రాళ్ల కట్ట కడితే నీటిని వాడుకోవచ్చని సూచించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న కాంట్రాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు ఎంతో త్యాగం చేశాయని, తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కార్మికులు, ఉద్యమకారుల పక్షాన నిలబడి కొట్లాడానని కవిత గుర్తు చేసుకున్నారు. కానీ వారికి అక్కడ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పనంగా అప్పగించిన భూములన్నింటిపై ఖచ్చితంగా రివ్యూ జరిపి, అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజా అజెండా లేదని తేల్చి చెప్పారు.








