రోజూ ఇసబ్గోల్ తీసుకుంటున్నారా? సరైన సమయం, సరైన విధానం తెలుసుకోండి..
ఇసబ్గోల్ (Psyllium Husk) అనేది సహజంగా లభించే అధిక ఫైబర్ (Fiber) కలిగిన ఆహార పదార్థం. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది సహాయకారిగా పనిచేస్తుంది. అయితే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇసబ్గోల్ ఎలా పనిచేస్తుంది?

ఇసబ్‌గోల్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది నీటిని పీల్చుకుని జెల్లా మారి జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. దీంతో ఆహారం పేగుల్లో సులభంగా కదలడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడేవారికి ఇది మంచి సహజ పరిష్కారంగా పరిగణిస్తారు.
జీర్ణవ్యవస్థకు మేలు

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇసబ్గోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా (Good Gut Bacteria) పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. దీంతో పేగుల పనితీరు మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
షుగర్ నియంత్రణలో సహాయం

మధుమేహం (Diabetes) ఉన్నవారికి కూడా ఇసబ్గోల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని కరిగే ఫైబర్ ఆహారంలోని గ్లూకోజ్ (Glucose) నెమ్మదిగా రక్తంలోకి చేరేలా చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL Cholesterol) స్థాయిలను తగ్గించడంలో, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయకారిగా ఉండొచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇసబ్గోల్ ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆకలి తగ్గి, అధికంగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గడంలో ఉపయోగం

ఇసబ్గోల్ తీసుకోవడానికి ఉత్తమ సమయం అవసరాన్ని బట్టి మారుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి భోజనం తర్వాత లేదా పడుకునే ముందు తీసుకోవచ్చు. బరువు నియంత్రణ కోసం భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు తీసుకుంటే ఆకలి నియంత్రణకు సహాయపడవచ్చు. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సూచన మేరకు భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు.
ఎలా తీసుకోవాలి?
సాధారణంగా ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల ఇసబ్గోల్ను ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలిపి వెంటనే తాగాలి. అనంతరం మరో గ్లాస్ నీరు తాగడం మంచిది. పాలు, మజ్జిగ లేదా పెరుగుతో కూడా కొందరు తీసుకుంటారు. అయితే ఏ రూపంలో తీసుకున్నా తగినంత నీరు తాగడం చాలా అవసరం. లేకపోతే మలబద్ధకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఇసబ్గోల్ను అధిక మోతాదులో తీసుకోవడం మంచిది కాదు. కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాగే ఇతర మందులు వాడుతున్నవారు ఇసబ్గోల్ను మందులకు కనీసం రెండు గంటల ముందు లేదా తర్వాత తీసుకోవడం మంచిది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని రోజువారీ ఆహారంలో చేర్చే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి. సరైన మోతాదులో, తగినంత నీటితో ఇసబ్గోల్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.








