స్టాక్ మార్కెట్ పేరుతో ఏపీలో భారీ కుంభకోణం..!
కాకినాడ వేదికగా స్టాక్ మార్కెట్లో(Stock Market) పెట్టుబడుల పేరుతో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మబలికిన ఒక ముఠా.. అమాయక ప్రజల నుండి ఏకంగా రూ.48 కోట్ల రూపాయలను వసూలు చేసి చేతులెత్తేసింది. ఈ భారీ స్కామ్‌కు పాల్పడిన ‘ఆల్మెటి జెనిసిస్’ (Almighty Genesis) అనే సంస్థకు చెందిన డైరెక్టర్లు మోజేష్, లలితాంబికలను పోలీసులు శ్రమించి అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఈ ఆర్థిక మోసంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్టాక్ మార్కెట్ లాభాలపై పెద్దగా అవగాహన లేని సామాన్యులను, వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ ఈ సంస్థ తమ నెట్‌వర్క్‌ను విస్తరించింది. మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే పోలీసులు కూడా ఉన్నట్లు గట్టిగా సమాచారం వినిపిస్తోంది.
ఈ సంస్థ పెట్టుబడిదారులకు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇచ్చింది. రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే మొదటి 10 నెలల పాటు ప్రతి నెల రూ.30,000 నుండి రూ.40,000 వరకు ఇస్తామని ఆశ చూపారు. అలాగే రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే కేవలం 20 నెలల్లోనే ఆ మొత్తాన్ని డబుల్ (రూ.12 లక్షలు) చేసి ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలోనే కొందరు ఏకంగా రూ.3 లక్షల నుండి రూ.50 లక్షల వరకు తమ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నెలనెలా వచ్చే భారీ రిటర్న్స్ ఆశతో తమ జీవితకాల కష్టార్జితాన్ని, రిటైర్మెంట్ సొమ్మును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము రోడ్డున పడ్డామని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, నిందితుల ఆస్తులను జప్తు చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.








