బ్రహ్మాణీ స్టీల్స్ పై ఏపీ సర్కార్ సంచలనం నిర్ణయం..!
కడప జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ‘బ్రాహ్మణి స్టీల్స్’ భూముల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ లీగల్ పోరాటాల తర్వాత, వివాదాస్పదంగా మారిన 14,000 ఎకరాల భారీ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూములన్నింటినీ తిరిగి ప్రభుత్వ ఆస్తుల రికార్డుల్లో చేర్చుతూ జిల్లా కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు (GO) జారీ చేశారు.
ఈ వివాదం వెనుక సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007వ సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం మొదటి విడతగా 10,700 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ తర్వాత ప్లాంట్ కనెక్టివిటీ మరియు విమానాశ్రయ నిర్మాణం కోసం మరో 3,115 ఎకరాల భూమిని కూడా అదనంగా కేటాయించడం జరిగింది. అయితే, ఒప్పందం ప్రకారం అక్కడ ఎలాంటి పరిశ్రమ స్థాపించకపోగా.. సదరు యాజమాన్యం ఆ ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా రూ. 350 కోట్ల మేర లోన్ తీసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
పరిశ్రమ పెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడంతో.. 2013 లోనే నాటి ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, ఈ వ్యవహారంపై యాజమాన్యం కోర్టులను ఆశ్రయించడంతో ఇన్నాళ్లూ స్టే లభించింది. ఈ నేపథ్యంలో, గత నెలలో విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. బ్రాహ్మణి స్టీల్స్ యాజమాన్యం దాఖలు చేసిన అన్ని పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎలాంటి లీగల్ అడ్డంకులు లేకపోవడంతో, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగి మొత్తం 14,000 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ వశం చేసింది.








