కేటీఆర్ ‘సర్వే’ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా!?
తెలంగాణ రాజకీయాలు వ్యూహ ప్రతివ్యూహాలతో రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త దుమారాన్ని లేపాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఏకంగా 78 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల్లోనే కాంగ్రెస్ ఓడిపోతుందని తేలిందని కేటీఆర్ బాంబు పేల్చారు. కేవలం పార్టీ సర్వేలే కాకుండా, రెండు ప్రముఖ మీడియా సంస్థల సర్వేలు, అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన నివేదికల్లోనూ బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలిందని ఆయన నొక్కి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త డీలా పడ్డ గులాబీ శ్రేణుల్లో కేటీఆర్ ప్రకటన సరికొత్త జోష్ నింపిందనే చెప్పాలి.
కేటీఆర్ సర్వేల రాజకీయంపై కాంగ్రెస్ శ్రేణులు అంతే తీవ్రంగా స్పందించాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడం, పగటి కలలు కనడం అలవాటేనంటూ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి మూడు నెలలకోసారి సర్వేలు చేయించుకుని, ‘మళ్లీ మనదే అధికారం, మనకు తిరుగులేదు’ అంటూ చంకలు గుద్దుకునేవారని, ఇప్పుడు కొడుకు కేటీఆర్ కూడా అదే అలవాటును కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.
తాము బీఆర్ఎస్ నాయకుల్లాగా కేవలం కాగితాలపై ఉండే సర్వేలను నమ్ముకుని రాజకీయం చేయమని, క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న ప్రజా రంజక పాలన, ఆరు గ్యారెంటీలపైనే తమకు నమ్మకం ఉందని, ఇలాంటి మైండ్ గేమ్స్‌కు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో సర్వేల రాజకీయం కొత్తేమీ కాదు. అయితే, కేవలం సర్వేలను నమ్ముకుని సంబరపడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో దేశవ్యాప్తంగా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు రాజకీయ పార్టీలు అంతర్గత, ఐవీఆర్ఎస్, మీడియా సర్వేలను నమ్మి, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి బొక్కబోర్లా పడ్డ ఉదాహరణలు అనేకం ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ అనుకూలంగా అనేక సర్వేలు వచ్చాయని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ వేరేలా ఉందనే విషయాన్ని గ్రహించకపోవడం వల్లే ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
సర్వేలు అనేవి ఒక నిర్దిష్ట సమయంలో ప్రజల మానసిక స్థితిని అంచనా వేయడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ అవి శాశ్వత విజయానికి గ్యారెంటీ ఇవ్వలేవు. నిజమైన ప్రజాభిమానం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు, వారి నమ్మకాన్ని గెలుచుకున్నప్పుడు మాత్రమే లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








