క్రీడల్లో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం : సీఎం రేవంత్ రెడ్డి
అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉషతో కలిసి యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం లోగో, వెబ్సైట్, గచ్చిబౌలి క్రీడా జిల్లా ప్రాజెక్టు నమూనాలను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. 2000వ దశకంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, ప్రపంచ మిలిటరీ క్రీడలు వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఘనత హైదరాబాద్‌కు ఉందని గుర్తుచేశారు. తర్వాత రెండు దశాబ్దాల పాటు నగరంలో, రాష్ట్రంలో ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడోత్సవాలను నిర్వహించలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదన్నారు. కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పారు. 25 క్రీడాంశాల్లో ఏడు వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను వచ్చే నవంబరులో హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామన్నారు.
విశ్వవిద్యాలయం పనితీరును స్పోర్ట్స్ బోర్డు, దాని సభ్యులు కపిల్ దేవ్, సంజీవ్ గోయెంకా, కొణిదెల ఉపాసన, కావ్య మారన్, రవికాంత్‌రెడ్డి, ఇతర డైరెక్టర్లే పర్యవేక్షిస్తారని తెలిపారు. వర్సిటీని పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని, పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందని వివరించారు. 2028 డిసెంబరులో యూనివర్సిటీని, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ కంటే చిన్నగా ఉండే దక్షిణ కొరియా ఒలింపిక్స్‌లో పదులకొద్దీ పతకాలు సాధిస్తుంటే, 140 కోట్ల మంది ఉన్న భారత్ పతకాలు సాధించకపోవడం బాధాకరమన్నారు. చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయో? లేదో తెలియదుగానీ, దేశానికి పతకాలు అందిస్తే కచ్చితంగా సర్కారు కొలువు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. క్రికెటర్ సిరాజ్, నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పారా అథ్లెట్ దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం ఇచ్చామని, త్వరలో ఒలింపియన్ ఇషాసింగ్‌కు కూడా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.








