కొరియన్ పెట్టుబడిదారులకు నమ్మకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేష్
ఏపీలో అమలుచేస్తున్న 3ఎస్ విధానం పెట్టుబడిదారులకు రక్షణ కవచం
ఆంధ్రప్రదేశ్ – కొరియా ఇన్వెస్ట్ మెంట్ డెస్క్ ఏర్పాటుకు చొరవచూపండి
ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయండి
దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీల ఏర్పాటుకు ఏపీ సిద్ధం
దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణకొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్ (Ms. Eui-hae Cecilia Chung)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో అమలుచేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుంది. భారత్ లో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చేసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో అందించే పన్నురాయితీలు, తక్కువధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పుతీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దీనివల్ల ప్రపంచ సప్లయ్ చైన్ నష్టాలను కూడా తగ్గించడానికి ఆస్కారమేర్పడుతుంది. కేవలం భారీ పరిశ్రమలేకాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోంది. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియన్ వర్క్ స్టాండర్ట్స్, లాంగ్వేజ్, కల్చర్ పై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉన్నాయి. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని లోకేష్ కోరారు.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కు సొంతమైన రెండో అతి పొడవైన తీరప్రాంతం, ప్రధానమైన డీప్ వాటర్ పోర్ట్స్ (విశాఖపట్నం, కృష్ణపట్నం, కొత్తగా రాబోయే 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు) వల్ల తక్కువ ఖర్చుతో ఎగుమతులకు లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశముంది. కొరియా వ్యాపారాలకు భారతీయ మార్కెట్ లో ప్రవేశం కల్పించి, తద్వారా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. భారత్-కొరియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుబంధంగా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్-కొరియా ఇన్వెస్ట్ మెంట్ డెస్క్, ఇరు ప్రాంతాల నడుమ వార్షిక ఆర్థిక భాగస్వామ్య చర్చలకు చొరవచూపండి. శాశ్వత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, విశాఖపట్నం – బుసాన్/ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు, డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.








