ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించండి : మంత్రి లోకేష్
10GW డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించండి
స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు చేయూత అందించండి
యువతను ఫ్యూచర్ స్కిల్ వర్క్ ఫోర్స్ గా మార్చేందుకు సహకరించండి
దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్ట్ మెంట్స్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్ తో మంత్రి లోకేష్ సమావేశం
సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్ట్ మెంట్స్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్ (Mr. Kamchan Kang)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ యువతను భవిష్యత్తుకు సిద్ధమయ్యే డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారుచేయడానికి కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 2029నాటికి 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి పరిశోధనలకు సహకారం అందించాలి
స్టూడెంట్/ ఫ్యాకల్టీ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లు, కరిక్యులమ్ డెవలప్ మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ – కొరియా విశ్వవిద్యాలయాలను అనుసంధానించాలి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లీన్-టెక్, హెల్త్-టెక్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై పరస్పరం సహకరించుకోవాలి.
ఇవి కూడా చదవండి
వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ టీఐహెచ్, యూనివర్సిటీలు – దక్షిణ కొరియా పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణల కేంద్రాల (మాగోక్ సైన్స్ పార్క్, నానో ఫ్యాబ్ సెంటర్ వంటివి) నడుమ ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించండి.
ఏపీలో కొరియా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుచేయండి
ఆంధ్రప్రదేశ్ లోని కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక కొరియా పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన భూమిని ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంకు ద్వారా అందిస్తాం. ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, ప్రత్యేక సింగిల్-విండో క్లియరెన్స్ యంత్రాంగం, ఆర్థిక ప్రోత్సాహకాలు, విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ వంటి పటిష్టమైన, ప్రత్యేక విధాన ప్యాకేజీతో పాటు, పూర్తిస్థాయి సౌకర్యాల కోసం ఒక కొరియా-డెస్క్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 10 GW సామర్థ్యం గల డేటా-సెంటర్ ప్రాజెక్టులను అమలు చేయడానికి అవసరమైన ఇంధన-మౌలిక సదుపాయాల ప్రణాళికలు, నియంత్రణ విధానాలను రూపకల్పనలో సహకరించేలా రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుతున్నాం.
మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించండి
ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపేందుకు మౌలిక సదుపాయాల నిర్మాణంలోకి కొరియన్ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం ఏపీలో ఉన్న 6 పోర్టులు, 7 విమానాశ్రయాలకు అదనంగా 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఇవి హెచ్డీ కేఎస్ఓఈ, శాంసంగ్ షిప్పింగ్, హన్వా ఓషన్ వంటి కొరియన్ సంస్థలకు గణనీయమైన అవకాశాలను అందిస్తాయి. ఏపీలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాల వల్ల గత రెండేళ్లలో గూగుల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, క్యారియర్, బీపీసీఎల్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో సహా, 240 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాం. ఇవి 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు మొత్తం పెట్టుబడులలో 25.3% గా ఉన్నాయి.
గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సుమారు 14 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2030 నాటికి 160 GW సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశ 500 GW జాతీయ లక్ష్యంలో సుమారు 32%కి సమానం. సోలార్, పవన శక్తి, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి తయారీ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు SK Energy, LG Energy, Hanwha వంటి కొరియా సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నాం. దక్షిణప్రాంతం /ఆగ్నేయాసియాలో ఆంధ్రప్రదేశ్ ను ప్రధాన లాజిస్టిక్స్, జలరవాణా, నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే మాధ్యేయం, స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మౌలిక సదుపాయాలు, సుస్థిరాభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొరియా వ్యూహాత్మక ప్రణాళిక సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు.








