ఏపీలో డిస్ ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
సునిక్ సిస్టమ్స్ సీఈవో ఎస్. డబ్ల్యూ. చుంగ్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): సెమీకండక్టర్స్, OLED, పెరోవ్‌స్కైట్ డిపాజిషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న సునిక్ సిస్టమ్ కో., లిమిటెడ్ (దక్షిణ కొరియా) సీఈవో ఎస్.డబ్ల్యూ. చుంగ్ (Mr. SW Chung), సంస్థ ఉన్నతస్థాయి బృందంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తోపాటు ఏపీ సెమీ కండక్టర్, డిస్ ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తాం. ‘సెమీకాన్ టెక్’ పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని కోరారు. సునిక్ సిస్టమ్స్ సీఈవో ఎస్.డబ్ల్యు. చుంగ్ మాట్లాడుతూ… మూడు విభాగాలలో వాక్యూమ్ థిన్-ఫిల్మ్ డిపోజిషన్ పరికరాలను తాము తయారు చేస్తున్నట్లు చెప్పారు. తమ ఉత్పత్తుల్లో OLED డిస్ప్లే ఎవాపరేషన్ (AMOLED, OLEDoS, 8.6-జెన్), స్పుటర్ / CVD / ఎచర్ / థిన్-ఫిల్మ్ ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ మాడ్యూల్స్, పెరోవ్‌స్కైట్ సోలార్, డిస్ప్లే డిపోజిషన్ పరికరాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో తమ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు. ఈ సమావేశంలో సునిక్ సిస్టమ్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జెహెచ్ లీ, సేల్స్ జనరల్ మేనేజర్ హెచ్.వై. చో, సీఎస్ సీవో కేసీ మ్యూన్, మీడియా ఇన్ఫోకామ్ సీఈవో సెవోన్ చో, క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ & సీటీవో డాక్టర్ రమణారావు మాగంటి పాల్గొన్నారు.








