13న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu ) సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Ramanaidu) తెలిపారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్‌కు సంబంధించిన డిజైన్లను పరిశీలించి తుది రూపు ఇవ్వనున్నారని వెల్లడించారు. పోలవరం టూరిజం హబ్ అభివృద్ధి అంశంపై జపాన్ (Japan) కు చెందిన నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
పోలవరం స్పిల్‌వే రూపకల్పనలో తెలుగు సంస్కృతి, రాష్ట్ర వైభవం ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. సీఎం సూచనలకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు. గోదావరి నది గొప్పతనాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్టులు, ఎమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారులు 365బీబీ, 516ఈలను అనుసంధానించే ప్రణాళికలో భాగంగా పోలవరం ప్రాజెక్టును కూడా చేర్చుతున్నామని మంత్రి వెల్లడించారు.








