తెలంగాణపై జేపీ నడ్డా ‘ట్రిపుల్ యాక్షన్’ వ్యూహం!
తెలంగాణలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈసారి మునుపెన్నడూ లేనంత సీరియస్‌గా దృష్టి పెట్టింది. దక్షిణ భారతాన కర్ణాటక తర్వాత పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణే సరైన వేదిక అని ఢిల్లీ పెద్దలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి దిశానిర్దేశం చేయగా, తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ వేదికగా క్షేత్రస్థాయి శ్రేణులకు సరికొత్త కార్యాచరణను నూరిపోశారు. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అనే రీతిలో బీజేపీ ఇక్కడ ‘మిషన్ తెలంగాణ’ను పరుగులు పెట్టిస్తోంది.
జేపీ నడ్డా తన పర్యటనలో రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన అత్యంత కీలకమైన స్పష్టత.. “ఇతర పార్టీల నేతలకు తలుపులు తెరవండి”. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఖరితో, అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ భవిష్యత్తుపై నమ్మకం లేక పలువురు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అధిష్టానం వద్ద పక్కా సమాచారం ఉంది. “కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరితో విసిగిపోయిన పలువురు కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు” అని నడ్డా స్పష్టం చేశారు. ఈ ‘ఆపరేషన్ ఆకర్ష్’ ద్వారా క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులను చేర్చుకుని, తద్వారా రాబోయే రోజుల్లో సంస్థాగతంగా మరింత బలపడాలనేది అధిష్టానం తొలి వ్యూహం.
ఇవి కూడా చదవండి
తెలంగాణ బీజేపీని చాలా కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య.. అంతర్గత విభేదాలు, సీనియర్-జూనియర్ల మధ్య సమన్వయ లోపం. ఈ బలహీనతను గమనించిన అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు రాష్ట్ర నేతలకు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. పార్టీ నేతలంతా వ్యక్తిగత అజెండాలను, విభేదాలను పూర్తిగా పక్కన పెట్టాలని నడ్డా తేల్చి చెప్పారు. పరస్పర సహకారం, సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తేనే క్యాడర్లో ఉత్సాహం వస్తుందని, క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని హితబోధ చేశారు.
కేవలం చేరికలు, అంతర్గత సమావేశాలకే పరిమితం కాకుండా.. ప్రజా క్షేత్రంలో పోరాటాల ద్వారానే మైలేజ్ వస్తుందని బీజేపీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారని, వారిలో నమ్మకం ఏర్పడుతుందని నడ్డా క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర ఆందోళనలు చేపట్టాలని నడ్డా సూచించారు. ఏ సమస్య వచ్చినా “మాకు బీజేపీ అండగా ఉంది” అనే బలమైన నమ్మకాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
సరిగ్గా నితిన్ నబీన్ మూడు రోజుల సంస్థాగత పర్యటన ముగిసిన కొద్ది రోజులకే.. జేపీ నడ్డా కూడా రంగంలోకి దిగడం చూస్తుంటే తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ఒక పక్కా రోడ్‌మ్యాప్‌తో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్గత క్రమశిక్షణ, చేరికల ప్రోత్సాహం, క్షేత్రస్థాయి పోరాటాలు అనే ‘ట్రిపుల్ యాక్షన్’ వ్యూహంతో కమలనాథులు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఢిల్లీ వ్యూహాలు తెలంగాణ గడ్డపై ఎంతవరకు పారుతాయో కాలమే నిర్ణయించాలి.








