JP Nadda: ఖరీఫ్ రైతులకు కేంద్రం భరోసా.. దేశంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు!
వర్షాకాలం (ఖరీఫ్) సీజన్ అనగానే దేశవ్యాప్తంగా అన్నదాతలను ముందుగా వేధించే సమస్య ఎరువుల కొరత. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశంలో తగినంత ఎరువుల నిల్వలు (Fertilizer stocks) అందుబాటులో ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభ వేదికగా దేశ వ్యవసాయ రంగానికి భరోసానిస్తూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
అనూహ్యంగా పెరిగిన ఉత్పత్తి
గత పదేళ్లలో భారతదేశం యూరియా (Urea) ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించిందని మంత్రి (JP Nadda) సభకు వివరించారు. 2014కి ముందు దేశీయంగా కేవలం 230 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అయ్యేది. కానీ కేంద్రం తీసుకున్న వ్యూహాత్మక చర్యల ఫలితంగా ఈ సామర్థ్యం ఇప్పుడు ఏకంగా 315 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని ఆయన వెల్లడించారు. ఈ భారీ అదనపు ఉత్పత్తి ఖరీఫ్ సీజన్లో ఎరువుల డిమాండ్‌ను సునాయాసంగా తీర్చగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
‘ఆత్మనిర్భర్’ వైపు అడుగులు
ఎరువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని (Import dependency) క్రమంగా తగ్గించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా పటిష్టమైన అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా మూతబడిన ఫెర్టిలైజర్ ప్లాంట్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త కర్మాగారాలను యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చింది. 2014 తర్వాత తెలంగాణలోని రామగుండం, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, జార్ఖండ్‌లోని సింద్రి, బీహార్‌లోని బరౌని, పశ్చిమ బెంగాల్‌లోని పానాగఢ్ ప్రాంతాల్లో భారీ ఎరువుల కర్మాగారాలను ఏర్పాటు చేసి జాతీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అమాంతం పెంచినట్లు జేపీ నడ్డా (JP Nadda) వివరించారు.
దీర్ఘకాలిక ఒప్పందాలు
ఒకవైపు దేశీయ ఉత్పాదకతను పెంచుతూనే, మరోవైపు భవిష్యత్తులో ముడిసరుకు లేదా డీఏపీ (DAP) లాంటి ఇతర కాంప్లెక్స్ ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్రం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గ్లోబల్ మార్కెట్లో ధరల ఒడిదుడుకులను తట్టుకుని దేశీయ రైతాంగానికి అండగా నిలిచేందుకు.. జోర్డాన్, మొరాకో, సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాలతో ఇప్పటికే వ్యూహాత్మక దీర్ఘకాలిక ఒప్పందాలు (Long-term agreements) కుదుర్చుకున్నట్లు మంత్రి (JP Nadda) సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఒప్పందాల వల్ల దేశంలో ఎరువుల సరఫరా గొలుసు మరింత బలోపేతం అవుతుందని, రైతులు బ్లాక్ మార్కెట్ వదంతులను నమ్మవద్దని, సకాలంలో నాణ్యమైన ఎరువులు వారికి అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి








