జమ్మూ కాశ్మీర్ ‘‘రాష్ట్ర హోదా పునరుద్ధరణ’’ అంశం మళ్లీ తెరపైకి.. ఢిల్లీ కేంద్రంగా పోరాటం
శ్రీనగర్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ ఈ దీక్ష జరగనుంది. ఈ నిరసనలో పాల్గొనాలని జమ్మూ కాశ్మీర్ గ్రాండ్ ముఫ్తీ మరియు హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ అయిన మత పెద్ద మిర్వాజ్ ఉమర్ ఫరూక్‌తో సహా దేశంలోని 52 పార్టీలకు నేషనల్ కాన్ఫరెన్స్ లేఖలు రాసింది. ఆహ్వానించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజున జంతర్ మంతర్ వద్ద జరిగే శాంతియుత, ప్రజాస్వామ్య నిరసనలో పాల్గొనవలసిందిగా జమ్మూ కాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలకు, దేశవ్యాప్తంగా ఉన్న నాయకులకు ఎన్‌సి అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.
“ఇది ఏదో ఒక పార్టీకి, ప్రాంతానికి లేదా వర్గానికి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం, రాజ్యాంగాన్ని నిలబెట్టడం మరియు పదేపదే హామీ ఇచ్చినట్లుగా జమ్మూ-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం గురించిన అంశం,” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు మరియు అప్పటి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పదేపదే హామీ ఇచ్చిందని ఎన్సీ (NC) అధ్యక్షుడు తన లేఖలో పేర్కొన్నారు.
2024లో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా జరిగి, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీ మాత్రం ఇంకా నెరవేరలేదని ఆయన అన్నారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం ఏమిటంటే..
ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సమయంలోనే.. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత హోదా తాత్కాలికమేనని, సరైన సమయంలో తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియకు కేంద్రం కట్టుబడి ఉందని, రాష్ట్ర హోదా పునరుద్ధరణపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కూడా తెలిపింది.
2019 ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ, లడఖ్ వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.ఇప్పటికే ఆరేడు సంవత్సరాలు పూర్తైంది. దీంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తిరిగి పునరుద్ధరించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.








