గులాబీ గూటి రచ్చ.. ‘సొంత బిడ్డే’ ఆయుధమైతే..?
తెలంగాణ రాజకీయాల్లో గులాబీ గూటి పంచాయితీ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. నిన్నమొన్నటి వరకు కేవలం అంతర్గత విభేదాలుగా భావించిన వ్యవహారం, ఇప్పుడు ఏకంగా పార్టీ మూలాలనే కదిలించే స్థాయికి చేరింది. సొంతంగా ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు BRS అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలు రాజకీయ గీతల్ని దాటిపోతున్నాయి. నిన్నటి వరకు రాజకీయ విమర్శలకే పరిమితమైన కవిత.. ఈసారి నేరుగా బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న పార్టీ ఫండ్, క్విడ్ ప్రో కో వ్యవహారాలను వీధిలోకి లాగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ను బద్నాం చేయడంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకంటే కవిత పాత్రే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికార కాలంలో కూడబెట్టిన 1400 కోట్ల నిధులపై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్మును గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, దానికి ప్రతిఫలంగా ఆ కాంట్రాక్టర్ల నుండి భారీగా కమిషన్లు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండ్‌గా మార్చారని ఆమె నేరుగానే ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ అధినాయకత్వంపైనే, అది కూడా క్విడ్ ప్రో కో కోణంలో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలపై దాడి చేయడం సాధారణ విషయం కాదు. గతంలో కేసీఆర్ అవినీతి రహిత పాలన అందించారని చెప్పుకునే గులాబీ శ్రేణులకు ఇప్పుడు ఈ ఆరోపణలు మింగుడుపడటం లేదు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఒక సొంత విమానాన్ని కొనుగోలు చేసిందనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ వివాదం అలా ఉంచితే, తాజాగా జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ది పయనీర్’ ను కూడా పార్టీ నిధులతోనే కొనుగోలు చేశారంటూ కవిత సరికొత్త బాంబు పేల్చారు. తనను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసి.. వందల కోట్ల పార్టీ ధనాన్ని వాడుకుంటూ కేటీఆర్ తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని, మీడియా సంస్థలను చేతుల్లోకి తీసుకుని బలపడుతున్నారనే ఆవేదన, ఆగ్రహం కవిత మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీలో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) అని పేరుతో పార్టీ పెట్టుకున్నారు. కానీ కేటీఆర్ ఆ పేరు రాకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారని కవిత నమ్ముతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ బలాన్ని తాను పొందేందుకు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్‌ను సమీకరించుకునేందుకు తాను కొత్తగా టీఆర్ఎస్ పేరుతో పొలిటికల్ ప్లాట్‌ఫారమ్‌ను పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నాలను కేటీఆర్ తీవ్రంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరును తానే రిజిస్టర్ చేయించుకుని కవితకు చెక్ పెట్టాలని కేటీఆర్ చూడటంతో ఆమెలో అసహనం కట్టలు తెంచుకుంది. అటు సెంటిమెంట్ పేరు దక్కకపోవడంతో.. నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు, సొంత కుటుంబ సభ్యులు.. అదీ మాజీ ముఖ్యమంత్రి కూతురు చేసే ఆరోపణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రాని మైలేజ్, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలకు సులువుగా దొరికింది. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి ఇంతకంటే బలమైన అస్త్రం ప్రత్యర్థులకు దొరకదు. కవిత చేసిన ఈ క్విడ్ ప్రో కో, 1400 కోట్ల కమిషన్ల ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని నైతికంగా కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంది.








