కాళేశ్వరంపై బీఆర్ఎస్తో జతకలిసిన ఈటల గళం..!
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న జలవివాదం సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు కేవలం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న కాళేశ్వరం నీటి పంపింగ్ డిమాండ్‌కు, ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా జతకలిశారు. ప్రాజెక్టు నీటి సరఫరా, హైదరాబాద్ తాగునీటి ఎద్దడిపై ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల వైఖరి ఈ అంశంలో దాదాపు ఒకేలా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై పదునైన విమర్శలు గుప్పించారు. తానేమీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తిని కాదని, స్వయం ప్రకాశితుడినని స్పష్టం చేశారు. “నేను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారున్ని, అదే నా గుర్తింపు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను.. చీల్చి చెందాడుతా. నా కణతపై AK 47 పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడడు.” అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని ఈటల ఆరోపించారు. తాము మేడిగడ్డలో నీటిని నిల్వ చేయమని అడగడం లేదని, నదిలో వృథాగా కిందకు పోతున్న నీళ్లను మాత్రమే పంప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాదులకు బ్యారేజ్ లేకపోయినా నీటిని పంప్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన గణాంకాలను, హెచ్చరికలను తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడే 107 MGD నీళ్ల సరఫరా తక్కువగా ఉందని, నీటి కొరత వస్తే ప్రజలు ఎటు పోవాలని ప్రశ్నించారు. మన దేశం, రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, 60 శాతం ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారని, నీళ్లు ఇవ్వకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం బోనులో నిలబెడుతోందని మండిపడ్డారు.
తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ- NDSA మార్గదర్శకాలను వ్యతిరేకించడం లేదని ఈటల స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా బయటపెట్టాలని, బాధ్యులను తేల్చి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు డబ్బులను వృథా చేయకుండా, ఆ అవినీతి సొమ్మును రికవరీ చేయాలన్నారు. కానీ, ఆ నెపంతో రాజకీయాలు చేస్తూ రైతులను, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు కోపం వస్తే కేసీఆర్ లాంటి వాడే ఖతమైపోయాడని, సందర్భం వస్తే పాతాళంలో పాతర వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. “భేషజాలు బంద్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంగా ఆలోచన చేయాలి” అని హితవు పలికారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయాలని, కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం అదే లైన్ లో కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ‘దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్’ అనే బీజేపీ ఫిలాసఫీకి అనుగుణంగా, తాను తెలంగాణ బిడ్డగా ‘తెలంగాణ ఫస్ట్’ అంటూ ఈ పోరాటానికి సిద్ధమయ్యానని ఈటల ప్రకటించారు.
ఒకే అంశంపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు ఉమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగడంతో.. టెక్నికల్ కారణాలు చెప్తూ నీటి పంపింగ్ ను ఆపిన అధికార పక్షం డిఫెన్స్ లో పడింది. ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించుకోవాలే తప్ప, పిచ్చి ఆర్గ్యుమెంట్లు, విమర్శలు బంద్ చేయాలన్న ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.








